China: రష్యా, ఉక్రెయిన్ ల యుద్ధానికి ఏడాది పూర్తి.. ఇరు దేశాలకు చైనా కీలక సూచన
- రెండు దేశాలు సంయమనం పాటించాలన్న చైనా
- శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచన
- పౌరులపై దాడులు చేయవద్దని హితవు
ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమై నేటికి సరిగ్గా ఒక ఏడాది పూర్తయింది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ భారీగా నష్టపోయింది. అయినప్పటికీ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా రష్యాతో పోరాడుతూనే ఉంది. ఇంకెంత కాలం ఈ యుద్ధం కొనసాగుతుందో, ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. యుద్ధం ఇలాగే కొనసాగితే ఉక్రెయిన్ నగరాలు నామరూపాల్లేకుండా పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై రష్యా మాట్లాడుతూ ఇరు దేశాలకు కీలక సూచన చేసింది.
ఉక్రెయిన్, రష్యాలు సంయమనం పాటించాలని... శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చైనా సూచించింది. ఈ రెండు దేశాలు ముఖాముఖి చర్చలు జరిపేలా అన్ని దేశాలు ప్రయత్నించాలని కోరింది. ఈ మేరకు 12 పాయింట్లతో కూడిన 'పొలిటికల్ సెటిల్ మెంట్' పేపర్ ను చైనా తన విదేశాంగ శాఖ వెబ్ సైట్ ద్వారా విడుదల చేసింది.
అవసరమైతే అణ్వాయుధాలను వాడటానికి కూడా వెనుకాడమని రష్యా అధినేత పుతిన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై చైనా స్పందిస్తూ... అణ్యాయుధాలను వాడటమే కాదు, వాటి యుద్ధ క్షేత్రంలో మోహరించడం కూడా పెను విపత్తేనని చెప్పింది. ప్రజలను కాపాడటమే ముఖ్యమని తెలిపింది. అంతర్జాతీయ మానవతా చట్టానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండాలని సూచించింది. పౌరులు లేదా పౌర సౌకర్యాలపై దాడులు చేయకూడదని చెప్పింది.