kondagattu: కొండగట్టు అంజన్న గుడిలో దొంగతనం
- 9 లక్షల విలువైన వెండి వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగలు
- గురువారం అర్ధరాత్రి దాటాక వెనక వైపు నుంచి ఆలయంలోకి చొరబాటు
- గుడి మూసేసి విచారణ జరుపుతున్న అధికారులు
కొండగట్టు అంజన్న గుడిలో దొంగలు పడ్డారు. గుడిలోని 15 కిలోల వెండి, బంగారు నగలను ఎత్తుకెళ్లారు. గురువారం అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు బేతాళుడి గుడి ప్రాంతం నుంచి ప్రధాన ఆలయం లోపలకు చొరబడినట్టు పోలీసులు గుర్తించారు. ముగ్గురు యువకుల చేతుల్లో కటింగ్ ప్లేయర్స్ తో పాటు ఇతరత్రా సామగ్రి ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. డాగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా కొండగట్టుకు చేరుకొని దొంగల ఉనికిని పసిగట్టే పనిలో పడ్డాయి. వేలిముద్రల సేకరణతో పాటుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఆగంతుకుల ఆచూకీ కోసం గాలిస్తున్నాయి.
అంజన్న ఆలయంలో రోజులాగే గురువారం కూడా స్వామి వారి నిత్యసేవలు ముగిసిన తరువాత అధికారులు ప్రధాన ద్వారానికి తాళం వేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటాక ముగ్గురు దొంగలు ఆలయం వెనక ద్వారాన్ని తెరిచి లోపలకు చొరబడ్డారు. ఆలయంలోని స్వామివారి 2 కిలోల వెండి మకర తోరణం, అర్ధమండపంలోని 5 కిలోల ఆంజనేయస్వామి వెండి ఫ్రేమ్, 3 కిలోల నాలుగు వెండి శఠగోపాలు, స్వామివారి 5 కిలోల వెండి తొడుగు తదితర వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
ఈ ఆభరణాలు దాదాపు 15 కిలోల వరకు ఉంటాయని, వీటి విలువ సుమారు. 9 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆలయంలో దొంగతనం జరిగిన నేపథ్యంలో పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించడంలేదు. చోరీ చేసిన వారు స్థానికులా లేక వేరే ప్రాంతం నుంచి వచ్చారా? అనేది తేల్చే పనిలో పడ్డారు.