Kerala: నీళ్ల కోసం విద్యార్థుల ఆందోళన.. తన చాంబర్ లోనే బంధించిన ప్రిన్సిపాల్.. కేరళలో ఘటన!
- కాసర్ గోడ్ జిల్లాలో ప్రభుత్వ కాలేజీలో నీళ్లు కలుషితమవుతున్నాయని విద్యార్థుల ఫిర్యాదు
- వారితో కఠినంగా మాట్లాడిన ప్రిన్సిపాల్ ఎం.రెమా
- విద్యార్థులు బయటికి వెళ్లకుండా తన చాంబర్ లోనే లాక్
- ప్రిన్సిపాల్ ను విధుల నుంచి తొలగించిన కేరళ సర్కారు
క్యాంపస్లో తాగు నీరు సరిగ్గా లేదని ఫిర్యాదు చేసిన విద్యార్థులను తన చాంబర్ లోనే బంధించారో ప్రిన్సిపాల్. కేరళలోని కాసర్ గోడ్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఇది కాస్తా వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సదరు ప్రిన్సిపాల్ ను తొలగించింది.
కాసర్ గోడ్ జిల్లాలో ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఎం.రెమా పనిచేస్తున్నారు. నీళ్లు కలుషితమవుతున్నాయని, బాగుండటం లేదని ఆమెకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అయితే ప్రిన్సిపాల్ సమస్యను పరిష్కరించకపోగా.. విద్యార్థులతో కఠినంగా మాట్లాడారు. దీంతో ఆమె చాంబర్ లోనే వారు నిరసనకు దిగారు. ప్రిన్సిపాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్.. వారిని తన చాంబర్ లోనే బంధించారు.
దీనిపై ఉన్నత విద్యా శాఖ, మంత్రికి విద్యార్థులు ఫిర్యాదులు పంపారు. స్పందించిన మంత్రి ఆర్.బిందు.. విద్యార్థుల ఫిర్యాదు ఆధారంగా ప్రిన్సిపాల్ ను విధుల నుంచి తొలగించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. రెమా స్థానంలో.. జియాలజీ డిపార్ట్ మెంట్ సీనియర్ ఫ్యాకల్టీ ఏఎన్ అనంతపద్మనాభను నియమించినట్లు చెప్పారు.