CPI Ramakrishna: వివేకా హత్య కేసులో సీఎం జగన్ ఇకనైనా నోరు విప్పాలి: సీపీఐ రామకృష్ణ
- కర్నూలులో మీడియాతో మాట్లాడిన రామకృష్ణ
- పచ్చ పైత్యం ముదిరిపోయింది అంటూ సాక్షిలో ఆర్టికల్
- ఎంతో వివరణాత్మకంగా ఆర్టికల్ రాశారన్న రామకృష్ణ
- మరి సీఎం జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని నిలదీసిన వామపక్ష నేత
మార్చి 2న విజయవాడలో చేపడుతున్న మహాధర్నా వాల్ పోస్టర్లను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేడు కర్నూలులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన వివేకా హత్య కేసుపై స్పందించారు.
సాక్షి పేపర్లో ఇవాళ పచ్చ పైత్యం ముదిరిపోయింది అంటూ బ్రహ్మాండమైన ఆర్టికల్ రాశారని వెల్లడించారు. ఎంతో వివరణాత్మకంగా ఆ ఆర్టికల్ రాశారని, మరి ఆ వివరాలన్నీ ఉన్నప్పుడు వివేకా హత్య కేసులో సీఎం జగన్ ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని రామకృష్ణ నిలదీశారు.
"సీఎం జగన్ కు అన్ని విషయాలు తెలిసి ఉండి, సొంత చిన్నాన్నను ఎవరు చంపారో, ఎలా చంపారో తెలిసి ఉండి, 3 సంవత్సరాల 9 నెలలుగా వాళ్లపై చర్యలు తీసుకోలేదంటే ఆయనను ఏమనాలో అర్థంకావడంలేదు. అధికారం మీ వద్దే ఉంది, పోలీసులూ మీ వద్దే ఉన్నారు... ఇకనైనా జగన్ మోహన్ రెడ్డి నోరు విప్పాలి. కనీసం సాక్షిలో రాసిందాని గురించైనా ఆయన స్పందిస్తే చాలు" అని రామకృష్ణ పేర్కొన్నారు.