Bollywood: జాక్వెలిన్‌ను కాపాడేందుకు నేనున్నా: సుకేశ్ చంద్రశేఖర్
- రూ. 200 కోట్ల దోపిడి కేసులో ఆమె భాగం కాదన్న సుకేశ్
- జైలు నుంచి సుకేశ్ ను ఢిల్లీ కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
- ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ పై వాంగ్మూలం ఇచ్చిన సుకేశ్
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కి ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ భరోసా కల్పించాడు. రూ. 200 కోట్ల దోపిడి కేసులో జాక్వెలిన్ భాగం కాదని, ఆమె ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఆమెను రక్షించడానికి తానున్నానని తెలిపాడు. మానీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ను శుక్రవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు.
ఈ సందర్భంగా, జైలు శిక్ష అనుభవించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌పై తన వాంగ్మూలం ఇచ్చాడు. జైన్ తనపై బెదిరింపులు, మానసిక వేధింపులకు పాల్పడ్డారని సుకేశ్ గతంలో ఆరోపించాడు. ఈ విషయమై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ కూడా రాశాడు. తనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఆప్ నేత తనపై ఒత్తిడి తెస్తున్నారని, వేధిస్తున్నారని ఆరోపించారు. జైన్‌ను ఢిల్లీ క్యాబినెట్ నుంచి భర్తరఫ్ చేయాలని ప్రభుత్వాన్ని సుకేశ్ డిమాండ్ చేశాడు.
అంతేకాకుండా ఏఎస్పీ దీపక్ శర్మ తన నుంచి డబ్బు వసూలు చేశారని ఆరోపించాడు. తన బ్యారక్ లో సోదాలు జరుగుతున్నప్పుడు జైలు లోపల నుంచి ఒక వీడియోను లీక్ చేశారన్నాడు. కోర్టు బయట మీడియాతో మాట్లాడిన సుకేశ్ జైలు అధికారులు తన నుంచి డబ్బులు వసూలు చేశారని, అదే విషయాన్ని లిఖితపూర్వకంగా ఇచ్చానని తెలిపాడు. సత్యేంద్ర జైన్ కు రూ.70 కోట్లకు పైగా చెల్లించానని చెప్పాడు. కాగా, ఢిల్లీ కోర్టు సుకేశ్ ఈడీ కస్టడీని సోమవారం వరకు పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి సినీ నిర్మాత కరీం మొరానీకి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.
ఇక, దోపిడీ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పాత్ర గురించి అడిగిన ప్రశ్నకు సుకేశ్ సమాధానం ఇచ్చాడు. జాక్వెలిన్ ఈ కేసులో భాగం కాదని, ఆమె ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆమెను రక్షించడానికి తాను ఉన్నానని స్పష్టం చేశాడు.