Avinash Reddy: వివేకా హత్య జరిగిన చోట నేను వెళ్లేటప్పటికి ఓ లేఖ ఉంది.. కానీ ఆ లేఖను దాచిపెట్టేశారు!: ఎంపీ అవినాశ్ రెడ్డి

MP Avinash Reddy talks to media after CBI questioning

  • అవినాశ్ రెడ్డిని మరోసారి విచారించిన సీబీఐ
  • దాదాపు 4.30 గంటల పాటు విచారణ
  • తనకు తెలిసిన అన్ని విషయాలు సీబీఐతో చెప్పానన్న అవినాశ్
  • మళ్లీ విచారణకు రావాలని పిలవలేదని వెల్లడి

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు నేడు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారించారు. ఇటీవల అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ నేడు మరోసారి సుదీర్ఘంగా 4.30 గంటల పాటు ప్రశ్నించింది. 

విచారణ అనంతరం హైదరాబాదులోని సీబీఐ కార్యాలయం నుంచి వెలుపలికి వచ్చిన అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత నెల 28న తనను సీబీఐ విచారించిందని, దానికి కొనసాగింపుగా నేడు కూడా విచారించిందని వెల్లడించారు. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసిన సమాచారం అంతా చెప్పానని తెలిపారు. 

"ఈ సందర్భంగా మీడియాకు మనవి చేసేదొక్కటే... వార్తలను బాధ్యతగా ప్రచారం చేయండి. వాస్తవాలనే రాయండి. ఈ విషయంలో గతంలోనూ ఇదే చెప్పాను... ఇప్పుడూ అదే చెబుతున్నా. గతంలో నేను విజయమ్మ గారి వద్దకు వెళితే బెదిరించి వచ్చానని ప్రచారం చేశారు... దానిపై డిబేట్లు కూడా పెట్టారు. ఇది ఎంత వరకు సమంజసం! నేను దుబాయ్ కి వెళ్లిపోయానని, తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్లు చేశానని వక్రీకరించారు. 

దోషులెవరో, నిర్దోషులెవరో మీడియానే నిర్ధారిస్తే దర్యాప్తు సంస్థల విచారణపై అది ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడేం జరుగుతోంది అంటే... ఒక అబద్ధాన్ని సున్నా నుంచి వందకు పెంచే ప్రయత్నం జరుగుతోంది.... ఒక నిజాన్ని వంద నుంచి సున్నాకు తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. వాస్తవాలను వెలికితీసే క్రమంలో బాధ్యతగా వ్యవహరించండి" అని మీడియాకు హితవు పలికారు.

విచారణ గురించి అవినాశ్ ఏమన్నారంటే...

  • ఈ కేసులో నాకు తెలిసిందంతా చెప్పాను. మళ్లీ విచారణకు రావాలని సీబీఐ చెప్పలేదు. 
  • వివేకా హత్య కేసు మొదటి నుంచి వాస్తవాల కంటే కూడా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని నడుస్తోంది. ఇది సరికాదు.
  • పలు వాస్తవాలతో ఇవాళ సీబీఐ అధికారులకు రిప్రజంటేషన్ ఇచ్చాను. వాటిపైన కూడా విచారణ జరగాలని కోరాను.
  • గూగుల్ టేక్ ఔట్ అంటున్నారు.... గూగుల్ టేక్ ఔటో, టీడీపీ టేక్ ఔటో కాలమే నిర్ణయిస్తుంది. 
  • ఇవాళ సీబీఐ కౌంటర్ అఫిడవిట్ లో ఏ అంశాలు అయితే కనిపిస్తున్నాయో, అవే అంశాలు టీడీపీ వాళ్లు ఏడాది కిందట ప్రస్తావించారు. టీడీపీ వాళ్లు ఆరోపిస్తున్న విషయాలే సీబీఐ అఫిడవిట్ లో ఉన్నాయి. దీన్నిబట్టి సీబీఐ విచారణ పట్ల ఎవరికైనా సందేహాలు కలుగుతాయి. 
  • వివేకా చనిపోయిన రోజున మార్చురీ వద్ద మీడియాతో మాట్లాడాను... మళ్లా రెండ్రోజుల తర్వాత మీడియాతో మాట్లాడాను. ఆ రోజున ఏం మాట్లాడానో ఇవాళ కూడా అదే మాట్లాడుతున్నా... సీబీఐ వాళ్లతోనూ అదే చెప్పాను. మళ్లీ ఎన్నిసార్లు ఎవరు పిలిచి అడిగినా అదే చెబుతాను. ఎందుకంటే నాకు తెలిసింది అదే.
  • నేను ఈ కేసులో సాక్షినో, అనుమానితుడ్నో తెలియదు. నాకు 160 సీఆర్పీ కింద నోటీసులు ఇచ్చారు.
  • వివేకా హత్య జరిగిన తర్వాత నేను ఘటన స్థలానికి వెళ్లే సరికి అక్కడ ఒక లేఖ ఉంది. కానీ ఆ లెటర్ ను దాచిపెట్టేశారు. అది హత్య అని ఆ లేఖలో స్పష్టంగా ఉంది.
  • నేను చెప్పిన లేఖపై సీబీఐ అధికారులు ఏం నిర్ణయించుకుంటారో చూడాలి.
  • విచారణను న్యాయవాది పర్యవేక్షణలో, ఆడియో-వీడియో రికార్డింగ్ జరపాలని అడిగాము. అయితే విచారణ రికార్డింగ్ చేసినట్టు నాకు అనిపించలేదు. కానీ లోపల ఒక ల్యాప్ టాప్ మాత్రం నా ఎదురుగా ఉంచారు.

  • Loading...

More Telugu News