Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొనాలనుకుంటున్నారా?... డెలివరీకి 7 నెలలు ఆగాల్సిందే!
- భారత్ లోనూ హ్యుండాయ్ జోరు
- పలు మోడళ్లతో భారతీయులను ఆకట్టుకుంటున్న కొరియా సంస్థ
- తాజాగా క్రెటా-2023 విడుదల
- డిమాండ్ దృష్ట్యా పలు మోడళ్లకు భారీగా వెయిటింగ్ పీరియడ్
దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుండాయ్ భారత్ లోనూ వేళ్లూనుకుంది. శాంత్రో, ఐ10, ఐ20, వెర్నా, క్రెటా, వెన్యూ, ఆరా, అల్కజార్, టక్సన్ వంటి ఆకర్షణీయమైన మోడళ్లతో భారతీయుల మనసు దోచుకుంది. కోనా ఎలక్ట్రిక్, అయోనిక్ 5 వంటి మోడళ్లతో విద్యుత్ ఆధారిత కార్ల సెగ్మెంట్ లోనూ హ్యుండాయ్ పోటీ ఇవ్వనుంది.
ముఖ్యంగా, ఎస్ యూవీ సెగ్మెంట్ లో క్రెటాకు మాంచి డిమాండ్ ఉంది. ఇటీవలే హ్యుండాయ్ సంస్థ క్రెటా-2023 మోడల్ ను ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ వెర్షన్ ధర రూ.10.84 లక్షలు కాగా, దీంట్లో ప్రీమియర్ వెర్షన్ ధర రూ.19.13 లక్షలు (ఎక్స్ షోరూం).
లేటెస్ట్ మోడల్ క్రెటా కార్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వెయింటింగ్ పీరియడ్ ను పెంచేసింది. ఇప్పుడు కారును బుక్ చేసుకుంటే ఆ కారు మీ చేతికి అందాలంటే 6 నెలల నుంచి 7 నెలలు ఆగాల్సిందే.
హ్యుండాయ్ క్రెటా డీజిల్ వేరియంట్లు ఈ, ఈఎక్స్, ఎస్ ల వెయిటింగ్ పీరియడ్ 6 నెలల నుంచి 7 నెలులు కాగా.... ఎస్ఎక్స్ వేరియంట్ వెయిటింగ్ పీరియడ్ 5 నెలలు.
హ్యుండాయ్ క్రెటా పెట్రోల్ మోడల్ లో ఎస్ వేరియంట్ డెలివరీకి 7 నెలలు ఆగాల్సి ఉండగా, ఎస్ఎక్స్(ఓ) ఐవీటీ వేరియంట్ డెలివరీకి 5 నెలలు పడుతోంది. క్రెటా-ఈ వేరియంట్ కు 4 నెలలు, ఈఎక్స్, ఎస్ఎక్స్ ఐవీటీ వేరియంట్లకు 3 నెలలు వెయిటింగ్ పీరియడ్ గా నిర్దేశించారు.
ఇక క్రెటా ఎస్ ప్లస్, ఎస్ఈ, ఎస్ఎక్స్ వేరియంట్లు రెండు నెలల్లోనే చేతికి అందనున్నాయి. కాగా, హ్యుండాయ్ క్రెటా కారు ప్రీ బుకింగ్ సమయంలో రూ.25 వేలు టోకెన్ అమౌంట్ గా చెల్లించాల్సి ఉంటుంది.