Nara Lokesh: నేను మెగాస్టార్ అభిమానిని: నారా లోకేశ్
- తిరుపతిలో లోకేశ్ యువగళం పాదయాత్ర
- నేడు వివిధ వర్గాలతో భేటీ అయిన లోకేశ్
- అంకుర ఆసుపత్రి సమీపంలో యువతతో ముఖాముఖి
- లోకేశ్ ను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగిన యువతీయువకులు
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో భాగంగా వివిధ వర్గాలతో భేటీ అవుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, సూచనలు, సలహాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతుండగా, నేడు తిరుపతి అంకుర ఆసుపత్రి సమీపంలో 'హలో లోకేశ్' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ యువతీ యువకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా యువత అడిగిన ప్రశ్నలకు లోకేశ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తాను ఎప్పుడూ కంటతడి పెట్టలేదని, కానీ దేవాన్ష్ పుట్టిన క్షణాల్లో ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆనందబాష్పాలు వచ్చాయని వెల్లడించారు.
తాను మెగాస్టార్ అభిమానినని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమా చూశానని లోకేశ్ వెల్లడించారు. అయితే, బాలయ్య ఎంతైనా తన ముద్దుల మామయ్య అని, ఆయనను విశేషంగా అభిమానిస్తానని తెలిపారు. బాలా మామయ్య అన్ స్టాపబుల్ అని కొనియాడారు. ఆయన కొత్త సినిమా రిలీజ్ అయితే మొదటి షోకు మొదట ఉండేది తానేనని లోకేశ్ వివరించారు.
ఇక, గతంలో కంటే ఇప్పుడు స్లిమ్ గా, ఫిట్ గా ఉన్నారని, దీని వెనకున్న సీక్రెట్ ఏంటని ఒకరు ప్రశ్నించారు. అందుకు లోకేశ్ స్పందిస్తూ... తన స్లిమ్ నెస్ కు, ఫిట్ నెస్ కు కారణం తన అర్ధాంగి బ్రాహ్మణి అని వెల్లడించారు.
కొవిడ్ వ్యాప్తి సమయంలో రెండేళ్లు ఆమెకు దొరికిపోయానని చమత్కరించారు. ప్రతి రోజూ రన్నింగ్ చేయించేదని, తన డైట్ ను నియంత్రించేదని వివరించారు. ఇప్పుడు తాను పాదయాత్రలో ఏం తింటున్నా బ్రాహ్మణి తెలిసిపోతుందని అన్నారు. బ్రాహ్మణి తన ఫిట్ నెస్ వెనకున్న సీక్రెట్ మాత్రమే కాదని, తన సక్సెస్ కూడా అని గర్వంగా చెప్పారు.
అంతేకాదు, ఐపీఎల్ పైనా లోకేశ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఏపీకి కూడా ఐపీఎల్ టీమ్ కావాలని, మన రాష్ట్రంలోని క్రీడాకారులు జాతీయస్థాయిలో తగిన ప్రోత్సాహం లేక ఆగిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. తిరుపతిలో క్రీడా విశ్వవిద్యాలయం ఎందుకు ఏర్పాటు చేయకూడదని గతంలో తాను పుల్లెల గోపీచంద్ తో చర్చించానని లోకేశ్ వెల్లడించారు.
ప్రతిరోజూ పాదయాత్ర ముగిశాక ఏంచేస్తారన్న దానిపైనా లోకేశ్ స్పందించారు. పాదయాత్రలో ఎక్కువగా నడవడం వల్ల, పాదయాత్ర ముగిశాక కాళ్లు చల్లటి నీళ్లలో పెట్టుకుంటానని, ఆ సమయంలో సీనియర్ నేతలతో ఆ రోజు జరిగిన విషయాలు చర్చిస్తానని తెలిపారు.
తన టీమ్ తోనూ, స్థానిక నేతలతోనూ ఉల్లాసంగా గడుపుతామని, అన్ని కార్యక్రమాలు ముగిశాక ఫ్రెండ్స్ అనే టీవీ సీరీస్ చూస్తానని, తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆ టీవీ సిరీస్ ఎంతో ప్రజాదరణ పొందిందని వెల్లడించారు.