Panneerselvam: సుప్రీంకోర్టు తీర్పుతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు: పన్నీర్ సెల్వం
- అన్నాడీఎంకేకు జయలలితే శాశ్వత ప్రధాన కార్యదర్శి అన్న పన్నీర్
- పళనిస్వామి వర్గం అహంకారం పరాకాష్టకు చేరిందని విమర్శ
- ప్రజలనే న్యాయం అడుగుతామన్న మాజీ సీఎం
అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా పళనిస్వామి కొనసాగుతారని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో, పన్నీర్ సెల్వం వర్గం షాక్ కు గురయింది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో పన్నీర్ సెల్వం మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పుతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. అన్నాడీఎంకేకు జయలలితే శాశ్వత ప్రధాన కార్యదర్శి అని చెప్పారు. తాము ప్రజలనే న్యాయం కోరతామని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని అన్నారు.
కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. పళనిస్వామి వర్గం అహంకారం పరాకాష్టకు చేరిందని విమర్శించారు. వారి అహంకారాన్ని అణచివేసే శక్తి అన్నాడీఎంకే కార్యకర్తలకు, ప్రజలకు ఉందని చెప్పారు. త్వరలోనే జిల్లాల పర్యటనను చేపడతామని... ప్రజలనే న్యాయం కోరతామని తెలిపారు. పళనిస్వామి వర్గం డీఎంకేకు బీ టీమ్ అని ఆరోపించారు. వారి గురించి చెప్పాలంటే వేయి ఉన్నాయని ఎద్దేవా చేశారు.