Kotamreddy Sridhar Reddy: ఎంతటి వారినైనా ఎదుర్కొంటా: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
- తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడబోనన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
- మొదటి నుంచి జగన్ కు అండగా ఉన్నానని వెల్లడి
- ప్రశ్నిస్తే తన ఫోన్ ట్యాప్ చేశారని ఆవేదన
- నమ్మకం లేని చోట, అనుమానించిన చోట ఉండకూడదని అనుకున్నానని వ్యాఖ్య
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతటి వారినైనా ఎదుర్కొంటానని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడబోనని అన్నారు. ఈ రోజు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, డ్రైన్‌లు లేవని, విద్యుత్ సరిగా లేదని చెప్పారు.
‘‘పొట్టెపాళెం కలుజు వద్ద వంతెన నిర్మాణం చేయాలని ఒకటిన్నర సంవత్సరం నుంచి డిమాండ్ చేస్తున్నా. ములుమూడి వంతెన, రోడ్లకు రూ.28 కోట్లు ఇస్తానని సీఎం జగన్ చెప్పారు. కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అడిగాను. కాంట్రాక్టర్ రెండు కోట్లు ఖర్చు పెట్టారు. ఇంత వరకూ బిల్లులు ఇవ్వలేదు’’ అని కోటంరెడ్డి చెప్పారు.
కొమ్మరపూడి రైతులకు పరిహారం ఇవ్వాలని 50 సార్లు అడిగినా ఫలితం లేదని ఆయన ఆరోపించారు. బీసీ భవన్, అంబేద్కర్ భవన్ నిర్మాణం చేయాలని, స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరానని చెప్పారు. నెల్లూరు జిల్లాలో మొదటి నుంచి జగన్ కు తాను అండగా ఉన్నానని కోటంరెడ్డి చెప్పారు. ప్రశ్నిస్తే తన ఫోన్ ట్యాప్ చేశారని అన్నారు. నమ్మకం లేని చోట, అనుమానించిన చోట ఉండకూడదని అనుకున్నానని చెప్పారు.