Sonia Gandhi: రిటైర్ మెంట్ పై సోనియా గాంధీ పరోక్ష వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాల్లో మాట్లాడిన సోనియా
- భారత్ జోడో యాత్రతోనే తన రాజకీయ ఇన్నింగ్స్ ముగుస్తుండొచ్చని వ్యాఖ్య
- కాంగ్రెస్‌కు ఇదో కీలక మలుపు అవుతుండొచ్చని వెల్లడి
రాజకీయాల నుంచి రిటైర్ అయ్యే ఆలోచనలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాల్లో సోనియా గాంధీ ఈ మేరకు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రెండో రోజు సమావేశాల్లో 15 వేల మంది పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి సోనియా మాట్లాడారు. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగుస్తుండొచ్చని చెప్పారు.
‘‘2004, 2009లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మనం సాధించిన విజయాలు ఎంతో సంతృప్తినిచ్చాయి. ఇంకా సంతోషించే విషయం ఏంటంటే.. భారత్ జోడో యాత్రతోనే నా రాజకీయ ఇన్నింగ్స్ ముగుస్తుండొచ్చు. కాంగ్రెస్‌కు ఇదో కీలక మలుపు అవుతుండొచ్చు’’ అని సోనియా కీలక వ్యాఖ్యలు చేశారు. సామరస్యం, సహనం, సమానత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నట్లు భారత్ జోడో యాత్రతో తెలిసిందని సోనియా అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఇది సవాళ్లతో కూడుకున్న సమయం అని సోనియా అన్నారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్‌లు దేశంలో అన్ని సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. కొంత మంది వ్యాపారవేత్తలకు మద్దతు ఇవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్లు చెప్పారు.