CPI Ramakrishna: వందల ఎకరాలను అదానీకి కట్టబెడుతున్నారు: సీపీఐ రామకృష్ణ
- అదానీతో జగన్ లాలూచీ పడ్డారన్న రామకృష్ణ
- రాష్ట్రంలోని ఆస్తులన్నీ అప్పగిస్తున్నారని మండిపాటు
- కట్టబెట్టిన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
అదానీ కంపెనీలకు వందలాది ఎకరాలను కట్టబెడుతున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అదానీ కంపెనీలతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ప్రసన్నం చేసుకోవడానికి అదానీకి రాష్ట్రంలోని ఆస్తులన్నింటీనీ అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంటును కూడా అదానీ కంపెనీకే అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోందని అన్నారు.
గుజరాత్ పెట్టుబడిదారులతో జగన్ కు ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలని కోరారు. రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉన్న డెయిరీలను పక్కన పెట్టి గుజరాత్ కు చెందిన అమూల్ డెయిరీనీ ప్రోత్సహించాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. అదానీ కంపెనీలకు కట్టబెట్టిన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.