Congress: మేం అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా: కాంగ్రెస్

Will Give Special status for AP if we come into power says congress
  • రాయ్‌పూర్‌లో ఏఐసీసీ 85వ ప్లీనరీ
  • ఈశాన్య రాష్ట్రాలు సహా జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు హోదాను పునరుద్ధరిస్తామని హామీ
  • 2018 నుంచి మృతి చెందిన ఏపీ తెలంగాణ నేతలకు ప్లీనరీ సంతాపం
తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మరోమారు స్పష్టం చేసింది. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరుగుతున్న ఏఐసీసీ 85వ ప్లీనరీలో ఈ మేరకు తీర్మానం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది.

ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేసిందన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ కట్టబడి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై పోరాడతామన్నారు.

కాగా, 2018 నుంచి ఇప్పటి వరకు మరణించిన కాంగ్రెస్ నేతలకు ప్లీనరీలో సంతాపం తెలుపుతూ తీర్మానం ఆమోదించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ రోశయ్య, మర్రి నవీన్ బాబు, మజ్జి శారద, సబ్బం హరి, రెడ్డయ్య యాదవ్, బాలసుబ్బారావు, ఇటీవల మరణించిన మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌లకు సంతాపం ప్రకటించారు. అలాగే, తెలంగాణకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, ఎం.భూపేశ్ గౌడ్‌లకు ప్లీనరీలో నేతలు సంతాపం ప్రకటించారు.
Congress
Andhra Pradesh
AP Special Status
Raipur
Chhattisgarh
Congress Plenary

More Telugu News