Kurnool District: వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మరణించిన ఆదోని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్!

Another gym death software engineer died with heart attack in gym in Adoni
  • యువకుడికి ఇటీవలే కుదిరిన వివాహం
  • వ్యాయామం చేస్తుండగా కళ్లు తిరగడంతో జిమ్ నుంచి బయటకు
  • స్నేహితుడు నీళ్లు తెచ్చే సరికే మూర్చ
  • ఆసుపత్రికి తరలించే సరికే కన్నుమూత
వ్యాయామాలు చేస్తూ గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం ఓ కానిస్టేబుల్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురై మరణించాడు. కన్నడ క్రేజీ హీరో పునీత్ రాజ్‌కుమార్ కూడా ఇలానే వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మరణించారు. బాలీవుడ్ మోడల్, నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ (46) కూడా ఇలానే జిమ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ కూడా వ్యాయామం చేస్తుండగా గుండెపోటుకు గురైనా వైద్యులు సకాలంలో స్పందించి ఆపరేషన్ చేయడంతో కోలుకున్నారు. తాజాగా, కర్నూలు జిల్లా ఆదోనిలో జిమ్‌‌లో వ్యాయామం చేస్తుండగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. 

ఆదోని యువకుడు (28) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తూ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇటీవలే అతడికి పెళ్లి కుదిరింది. నిన్న ఉదయం పట్టణంలోని ఓ జిమ్‌కు వెళ్లాడు. అక్కడ వ్యాయామం చేస్తుండగా కళ్లు తిరుగుతున్నట్టు అనిపించడంతో స్నేహితుడితో కలిసి బయటకు వచ్చాడు. ఆ తర్వాత స్నేహితుడు నీళ్లు తెచ్చేందుకు వెళ్లాడు. అదే సమయంలో మూర్ఛ వచ్చి పడిపోయాడు. స్థానికులు స్పందించి సపర్యలు చేయడంతో కాసేపటికి తేరుకుని మళ్లీ కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే అతడిని పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్టు నిర్ధారించారు.
Kurnool District
Adoni
Adoni Software Engineer
Heart Attack
Gym
Gym Death

More Telugu News