Balineni Srinivasa Reddy: 2024 ఎన్నికల్లో వార్ వన్ సైడే: బాలినేని ధీమా!
- 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తే.. అందులో 11 మంది బీసీలేనన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి
- జగన్ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని వెల్లడి
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధిస్తామన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.4 శాతం జగన్ అమలు చేశారని వ్యాఖ్య
2024 ఎన్నికల్లో కూడా వార్ వన్ సైడ్ గానే ఉంటుందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో తామే గెలుస్తామని చెప్పారు. ఈ రోజు మీడియాతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.
తాము 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తే అందులో 11 మంది బీసీలే ఉన్నారని బాలినేని చెప్పారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపిస్తాయని అన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత ప్రాధాన్యతను బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు జగన్ ఇస్తున్నారని, సామాజిక న్యాయం పాటిస్తున్నారని చెప్పుకొచ్చారు.
టీచర్స్ లో తమకు వ్యతిరేకత ఉందని అంటున్నారని, కానీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే తాము 100 శాతం గెలవబోతున్నామని బాలినేని ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో కూడా వార్ వన్ సైడ్ గానే ఉంటుందని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధిస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.4 శాతం అమలు చేశారని తెలిపారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. రెండేళ్లపాటు రూపాయి ఆదాయం లేకున్నా ఎన్నికల హామీలు నెరవేరుస్తూ అభివృద్ధి కార్యక్రమాలపై జగన్ దృష్టిపెట్టారని తెలిపారు. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను గెలుస్తామని చెప్పారు.