AP CID: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై చర్యలకు ప్రభుత్వం ఆదేశం
- సునీల్ కుమార్‌పై కేంద్ర హోంశాఖకు హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదు
- సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్‌కు కేంద్ర హోం శాఖ లేఖ
- ఈ నెల 23న ఏపీ డీజీపీకి కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు
- ఎలాంటి చర్యలు తీసుకున్నదీ నివేదిక ఇవ్వాలన్న జవహర్‌రెడ్డి
సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సమయంలో ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సామాన్యులను చిత్రహింసలకు గురిచేశారన్న ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి స్పందించారు. ఆయనపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. ఆయనపై తీసుకున్న చర్యలపై వెంటనే తనకు నివేదిక పంపాలని ఆదేశించారు. ఈ నెల 23న రాసిన ఈ లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది.
సునీల్ కుమార్ సీఐడీ చీఫ్‌గా ఉన్నప్పుడు సామాన్యులపై అక్రమంగా కేసులు బనాయించి, కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేశారంటూ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గతేడాది అక్టోబరు 17న కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ.. నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారని, కస్టడీలో చిత్రవధకు గురిచేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ విషయాన్ని న్యాయమూర్తుల ఎదుట చెబితే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బాధితులను, వారి కుటుంబ సభ్యులను హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు.
సోషల్ మీడియా కేసులు తన పరిధిలోకి రాకున్నా వాటిని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆ ఫిర్యాదులో లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఈ నెల 3న ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డికి లేఖ రాసింది. దీంతో స్పందించిన ఆయన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాస్తూ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.