Manish Sisodia: రాత్రంతా సీబీఐ ఆఫీసులోనే గడిపిన మనీశ్ సిసోడియా
- సిసోడియాను నిన్న సాయంత్రం అరెస్ట్ చేసిన సీబీఐ
- ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్న వైనం
- బీజేపీని ప్రజలు శిక్షిస్తారన్న కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ నిన్న సాయంత్రం అరెస్ట్ చేసింది. ఆయనను అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి తరలించింది. సీబీఐ కేంద్ర కార్యాలయంలోనే నిన్న రాత్రంతా ఆయన గడిపారు. ఈరోజు ఆయనను కోర్టులో సీబీఐ ప్రవేశ పెట్టనుంది. కోర్టులో ప్రవేశ పెట్టే ముందు ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు.
మరోవైపు సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కలిశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, రాజకీయ కుట్రల్లో భాగంగానే బీజేపీ ఇదంతా చేస్తోందని మండిపడ్డారు. బీజేపీని ప్రజలు కచ్చితంగా శిక్షిస్తారని చెప్పారు.
మరోవైపు ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేస్తుందనే విషయం తమకు ముందే తెలుసని చెప్పారు. సీబీఐ పూర్తిగా బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించారు.