iran: ఇరాన్ లో వందలాది మంది విద్యార్థులపై విషప్రయోగం
- ఆడపిల్లలను చదువు మాన్పించేందుకేనని ఆరోపణలు
- క్వోమ్ సిటీలో సడెన్ గా అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులు
- విషప్రయోగం ఆరోపణలతో ఇరాన్ లో పేరెంట్స్ ఆందోళన
- నిందితులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి వివరణ
అమ్మాయిలు చదువుకోవద్దు.. స్కూలుకు వెళ్లొద్దనే లక్ష్యంతో ఇరాన్ లో స్కూలు విద్యార్థులపై విషప్రయోగం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు కాదు వందలాది మంది బాలికలపై ఇలా విషప్రయోగం చేస్తున్నారని, వారిలో కొంతమంది ఆసుపత్రుల పాలవుతున్నారని ప్రచారం జరుగుతోంది. అనారోగ్యంపాలైన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ నెల 14న క్వోమ్ సిటీ గవర్నరేట్ ముందు ఆందోళన చేశారు. దీంతో తాజాగా ఇరాన్ ఆరోగ్య శాఖ డిప్యూటీ మినిస్టర్ యోనస్ పనాహీ స్పందించారు.
క్వోమ్ సిటీలో కొంతమంది దుండగులు స్కూలు గర్ల్స్ పై విషప్రయోగానికి పాల్పడుతున్నారని చెప్పారు. బాలికా విద్యను ప్రభుత్వం మూసేయాలనే లక్ష్యంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గతేడాది నవంబర్ నుంచి ఇలాంటి కేసులు వందలాదిగా నమోదయ్యాయని, బాధిత బాలికలలో కొంతమంది ఆసుపత్రి పాలయ్యారని మంత్రి పనాహీ చెప్పారు. క్వోమ్ సిటీలోని స్కూళ్లలో ఇలా విషప్రయోగం జరుగుతోందని చెప్పారు.
దీనివల్ల బాధితులు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఇది చాలా సున్నితమైన అంశమని, జాగ్రత్తగా డీల్ చేస్తున్నామని చెప్పారు. అయితే, ఈ కేసులకు సంబంధించి ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. విషప్రయోగానికి పాల్పడే వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఆయన పేర్కొన్నారు.