Gummadi: నాన్నని బాగా కుంగదీసిన సంఘటన అదే: గుమ్మడి కూతురు శారద
- నాన్నగారికి పిల్లలంటే చాలా ఇష్టం
- మా మూడో అక్కయ్య కేన్సర్ తో చనిపోయింది
- ఆ సంఘటనను నాన్నగారు తట్టుకోలేకపోయారు
- గుమ్మడి గారి ఫస్టు హీరోయిన్ జమునగారేనని చెప్పిన కూతురు
తెలుగు తెరపై ఎన్టీఆర్ తరువాత ఏఎన్నార్ పేరును ఎలా చెప్పుకుంటామో, ఎస్వీఆర్ తరువాత గుమ్మడి గారి పేరును అలా చెప్పుకుంటాము. గుమ్మడి కనుముక్కు తీరు .. ఆయన మాట తీరు .. సహజమైన నటన ఆయనకి ఎంతోమంది అభిమానులను తెచ్చిపెట్టింది. ఇప్పటికీ అలాంటి నటుడు రాలేదంటే అతిశయోక్తి కాదు.
తాజా ఇంటర్వ్యూ లో గుమ్మడి కూతురు శారద మాట్లాడుతూ .. "గుమ్మడి గారి సంతానం ఏడుగురు. ఐదుగురు అక్కా చెల్లెళ్లం .. ఇద్దరు సోదరులు. నేను నాలుగో అమ్మాయిని. మాలో మా మూడో అక్కయ్య మాత్రం లేరు .. 44 ఏళ్ల వయసులోనే తను కేన్సర్ తో చనిపోయింది. ఆమె మరణమే నాన్నగారిని బాగా కుంగదీసింది .. తన కంటే ముందుగానే తన కూతురు చనిపోవడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు" అని అన్నారు.
"ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచే ఆయన హార్ట్ బలహీనమైపోయింది. సినిమాల్లోకి వెళ్లినప్పటికీ నాన్నకి మొహమాటం ఎక్కువగానే ఉండేది. ఎవరినీ వేషాలు అడిగేవారు కాదు. చాలామందికి తెలియదు ఆయన ఫస్టు హీరోయిన్ జమునగారే. 'జై వీరభేతాళ' అనే సినిమాను చేశారు. ఆ సినిమా నిర్మాత చనిపోవటంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది" అంటూ చెప్పుకొచ్చారు.