king fisher beer: బీర్లు అమ్మడం లేదంటూ ప్రజావాణిలో ఫిర్యాదు.. జగిత్యాలలో ఘటన!

complaint on kingfisher is not selling beers in jagital

  • అదనపు కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన బీరం రాజేష్ అనే యువకుడు
  • బెల్ట్ షాపుల్లో ఒక్కో బీర్ కు రూ.200 నుంచి 300 వరకు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు
  • నాసిరకం బీర్లతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వెల్లడి
  • బీర్ల కోసం 20 నుంచి 30 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందని వాపోయిన వైనం

కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ ఓ యువకుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. జగిత్యాలలో చల్లని బీర్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ బీరం రాజేష్ అనే యువకుడు ప్రజావాణిలో అదనపు కలెక్టర్ లతకు వినతి పత్రాన్ని అందజేశాడు. జిల్లాలో కల్తీ మద్యం, నాసిరకం బీర్లు అమ్ముతున్నారని, దీంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నాడు.

జిల్లాలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయని, అందులో ఒక్కో బీర్ కు రూ. 200 నుంచి 300 వరకు వసూలు చేస్తూ ప్రజల నుంచి దోపిడీ చేస్తున్నారని బీరం రాజేష్ చెప్పాడు. వెంటనే చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ను కోరాడు. వైన్ షాపుల్లో దొరక్కుండా బెల్టు షాపులలో బీర్లు దొరుకుతున్నాయని, అయితే బెల్టు షాపుల్లో అమ్మేవి ఒరిజినలా? నకిలీవా? అనేది అర్ధం కావడం లేదన్నాడు.

రాష్ట్రంలో ప్రతి సోమవారం కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. అందులో భాగంగా బీరం రాజేష్.. జగిత్యాలలో కేఎఫ్ బీర్లు దొరకడం లేదని, అక్కడ తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో దొరుకుతున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నాడు. బీర్ల కోసం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని అతడు వాపోవడం గమనార్హం.

ప్రస్తుతం అతడి వినతిపత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మందుబాబుల తరపున తన వాణి వినిపించాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి అతడి సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందా?

  • Loading...

More Telugu News