North Korea: ఉత్తర కొరియాలో హాలీవుడ్ సినిమాలు చూస్తే కఠిన శిక్షలే!
- పాశ్చాత్య సినిమాలు, టీవీ కంటెంట్ పై నిషేధం
- తల్లిదండ్రులకు ఆర్నెల్లు లేబర్ క్యాంపుల్లో శిక్ష
- పిల్లలకు ఐదేళ్ల జైలు శిక్ష
- పిల్లలకు చదువు తప్ప మరో ధ్యాస ఉండకూడదన్న కిమ్
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ నిరంకుశ పాలన కొనసాగుతోంది. పొరుగున ఉన్న దక్షిణ కొరియా సినిమాలు, టీవీ షోలు చూస్తే ఉత్తర కొరియాలో మరణశిక్ష కూడా విధిస్తారు. ఇప్పుడు ఉత్తర కొరియాలో హాలీవుడ్ సినిమాలు చూసినా కఠిన శిక్ష తప్పదట.
పిల్లలను హాలీవుడ్ సినిమాలు చూసేందుకు అనుమతించే తల్లిదండ్రులకు కఠిన శిక్షలు తప్పవని ఉత్తర కొరియా ప్రభుత్వం స్పష్టం చేసింది. పిల్లలు పాశ్చాత్య దేశాల సినిమాలు, టీవీ కంటెంట్ చూస్తూ దొరికిపోతే, వారి తల్లిదండ్రులను లేబర్ క్యాంపులకు పంపుతామని హెచ్చరించింది.
పెద్దలు ఆర్నెల్ల పాటు లేబర్ క్యాంపులో ఉండాలని, పిల్లలకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తామని తెలిపింది. పిల్లలకు చదువు తప్ప మరొకటి ఉండకూడదని, లేకపోతే వారు పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగమైపోతారని కిమ్ ప్రభుత్వం గత కొంతకాలంగా ప్రచారం చేస్తోంది.