Manish Sisodia: తన అరెస్టుపై సుప్రీంకోర్టులో మనీశ్ సిసోడియా పిటిషన్.. విచారించనున్న సీజేఐ చంద్రచూడ్
- సీబీఐ అరెస్ట్ ను సుప్రీంలో సవాల్ చేసిన సిసోడియా
- హైకోర్టుకు వెళ్లకుండా సుప్రీంకు ఎందుకొచ్చారన్న సీజేఐ
- వినోద్ దువా కేసును ప్రస్తావించిన సిసోడియా లాయర్
లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయనను విచారించాల్సి ఉందని... తమ కస్టడీకి అప్పగించాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేయగా... ఆయనను ఐదు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో మనీశ్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ఈ పిటిషన్ కు సంబంధించి సీజేఐ డీవై చంద్రచూడ్ వాదనలు వింటూ... హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా సిసోడియా తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.... జర్నలిస్ట్ వినోద్ దువా కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను ప్రస్తావించారు. కొవిడ్ ను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వంపై దువా చేసిన విమర్శల కేసులో... ఆయన నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చారని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన సీజేఐ... మధ్యాహ్నం 3.50 గంటలకు విచారణ చేపడతామని చెప్పారు.