Train coach: రైలు బోగీలను ఎలా క్లీన్ చేస్తారంటే.. వీడియో ఇదిగో!
- గతంలో కాంట్రాక్ట్ సిబ్బంది బోగీలను శుభ్రం చేసేవారని రైల్వే శాఖ వెల్లడి
- ప్రస్తుతం కోచ్ వాషింగ్ ప్లాంట్ ద్వారా క్లీన్ చేస్తున్నట్లు వివరణ
- ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేసిన రైల్వే శాఖ
రోజూ లక్షలాదిమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే రైలును ఎలా శుభ్రం చేస్తారనే విషయం చాలామందికి తెలియదు. ప్రయాణం ప్రారంభించే ముందు రైలు బోగీలన్నీ నీట్ గా ఉంటాయి. ప్రయాణంలో మురికిగా, అపరిశుభ్రంగా మారిన బోగీలను గతంలో కాంట్రాక్ట్ సిబ్బంది శుభ్రం చేసేవారు. ఒక్కో బోగీని కొంతమంది సిబ్బంది చకచకా క్లీన్ చేసేవారు. దీనివల్ల ఖర్చు ఎక్కువే.. సమయం కూడా ఎక్కువ తీసుకుంటుంది. తాజాగా ఈ పని కోసం రైల్వే శాఖ మెషీన్లపై ఆధారపడుతోంది. బోగీలను శుభ్రం చేసేందుకు పలు పెద్ద స్టేషన్లలో ఆటోమేటిక్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ ట్విట్టర్ లో పోస్టు చేసింది.
రైలు బోగీలను గతంలో శుభ్రం చేసిన విధానాన్ని, ఇప్పుడు ఎలా చేస్తున్నారనేది ఈ వీడియోలో రైల్వే శాఖ చూపించింది. గతంలో సిబ్బంది చేతులతో, కెమికల్స్ ను ఉపయోగించి వాటర్ తో శుభ్రం చేసేవారని చెప్పింది. ప్రస్తుతం ఈ పని కోసం ఆటోమేటెడ్ రైల్వే కోచ్ వాషింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు వివరించింది. రైలును ఈ ప్లాంట్ ద్వారా తీసుకెళితే పట్టాల పక్కనే అమర్చిన పొడవైన స్క్రబర్లు బోగీలను శుభ్రం చేయడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను ట్వీట్ చేస్తూ ‘హ్యాండ్ ప్రెస్ నుంచి సిస్టమాటిక్ స్విచ్ వరకు’ అంటూ రైల్వే శాఖ క్యాప్షన్ పెట్టింది.