Rajasri: అప్పట్లో మా పారితోషికాలు ఎలా ఉండేవంటే ..!: నటి రాజశ్రీ
- అలనాటి అందాల తార రాజశ్రీ
- వేలల్లోనే పారితోషికాలు ఉండేవని వెల్లడి
- హీరోలను బట్టి ఇచ్చేవారని వ్యాఖ్య
- హీరోయిన్స్ కోసం వెయిట్ చేసేవారు కాదని వివరణ
అలనాటి అందాల కథనాయికలలో రాజశ్రీ ఒకరు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ఆమె బిజీగా ఉండేవారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "అప్పట్లో పారితోషికాలు ఎక్కువగా ఉండేవి కాదు. వేలల్లో మాత్రమే ఇచ్చేవారు. అది కూడా హీరోలను బట్టి పారితోషికాన్ని ఫిక్స్ చేసేవారు. స్టార్ హీరోల జోడీగా చేస్తేనే ఎక్కువ పారితోషికం వచ్చేది" అన్నారు.
ఇక అప్పట్లో హీరోల డేట్స్ మాత్రమే ప్రధానంగా చూసుకునేవారు. ఆ సమయానికి అనుకున్న హీరోయిన్ డేట్స్ అందుబాటులో లేకపోతే, వెంటనే మరో హీరోయిన్ కి కబురు వెళ్లిపోయేది. హీరోయిన్స్ విషయంలో ఎంతమాత్రం వెయిట్ చేసేవారు కాదు. అందువలన మేము కూడా ఏ వేషం కోసం వెయిట్ చేసే వాళ్లం కాదు .. వచ్చింది చేసుకుంటూ వెళ్లే వాళ్లం" అని చెప్పారు.
"మా కాలంలో కూడా హీరోయిన్స్ మధ్య గట్టిపోటీ ఉండేది. సావిత్రి .. జమున వంటివారు సీనియర్స్ కనుక, వాళ్లకు మేము పోటీ కానేకాదు. మా గ్రూపులో నేను .. కృష్ణకుమారి .. కాంచన .. శారద .. వాణిశ్రీ ఉండేవారు. ఎవరికి తగిన వేషాలు వారికి వచ్చేవి. అందువలన మా మధ్యలో ఎప్పుడూ పోటీ భావన రాలేదు. అందువలన అందరం హ్యాపీగా ఉండేవారం" అని చెప్పుకొచ్చింది.