Joe Biden: మా ఆయన వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తారు.. జిల్ బైడెన్ వెల్లడి
- ఇప్పటికే వృద్ధ అధ్యక్షుడిగా రికార్డులకెక్కిన బైడెన్
- వచ్చే ఎన్నికల బరి నుంచి వైదొలుగుతారనే ప్రచారం
- కొట్టిపారేసిన జిల్ బైడెన్
- ప్రచారానికి బైడెన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారని వెల్లడి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 2024 ఎన్నికల బరిలో కూడా నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆయన భార్య, అమెరికా ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ అన్నారు. ఇందుకు తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. వయసు పైబడిన (80 ఏళ్లు) కారణంగా వచ్చే ఎన్నికల బరి నుంచి బైడెన్ వైదొలుగుతారనే ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో జిల్ బైడెన్ మాట్లాడారు.
ఇటీవల నమీబియా, కెన్యాలో జిల్ బైడెన్ పర్యటించారు. అక్కడ అసోసియేటెడ్ ప్రెస్ ప్రతినిధి.. సెకండ్ టర్మ్ కోసం బైడెన్ పోటీ పడతారా అని అడగడంపై జిల్ అసహనం వ్యక్తంచేశారు. ‘‘మీరు నమ్మాలంటే.. ఆయన ఎన్నిసార్లు చెప్పాలి?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2024లో బైడెన్ పోటీ చేయడంపై డెమోక్రాటిక్ పార్టీ సభ్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా రికార్డుల్లోకి ఎక్కిన ఆయనకు.. జనం ఓట్లు వేస్తారా? అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే బైడెన్ మాత్రం.. తాను రెండోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని గతంలోనే ప్రకటించారు.
‘‘నేనింకా పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ తర్వాత ప్రచారం మొదలుపెడతా’’ అని బైడెన్ ఓ సందర్భంలో అన్నారు. ‘‘నేను పోటీలో ఉంటానా? లేదా? అనేది 2023 ప్రారంభంలో ప్రకటిస్తా’’ అని గతేడాది నవంబర్ లో అన్నారు. వచ్చే రెండు నెలల్లో ఆయన స్పష్టత ఇవ్వొచ్చని డెమోక్రాట్లు భావిస్తున్నారు.