Sunil Mittal: త్వరలో ఎయిర్ టెల్ టారిఫ్ ల పెంపు?
- కాల్స్, డేటా రేట్లను పెంచాలని భావిస్తున్నట్లు చెప్పిన ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్
- ఎలాంటి ఖర్చు చేయకుండానే ప్రజలు 30 జీబీని వాడుకుంటున్నారని వ్యాఖ్య
- టెలికామ్ బిజినెస్ లో వచ్చే లాభాలు చాలా తక్కువని వెల్లడి
కాల్స్, డేటా రేట్లను పెంచాలని భావిస్తున్నట్లు భారతి ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ చెప్పారు. టెలికామ్ బిజినెస్ లో వచ్చే లాభాలు చాలా తక్కువని, ఈ ఏడాది టారిఫ్ లు పెంచుతామని తెలిపారు. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో ఆయన మాట్లాడారు. ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.
‘‘చాలా మూలధనాన్ని కంపెనీ తీసుకొచ్చింది. అదే బ్యాలెన్స్ షీట్ (జమా ఖర్చుల పట్టీ) ను బలంగా చేసింది. అయితే పరిశ్రమలో మూలధనంపై రాబడి చాలా తక్కువగా ఉంది. దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. భారతీయ టారిఫ్ పరిస్థితిలో రావాల్సిన చిన్న మార్పుల గురించే మాట్లాడుతున్నాం. ఈ సంవత్సరం పెంపు ఉంటుందని నేను ఆశిస్తున్నా’’ అని వివరించారు.
ప్రజలు ఇతర విషయాలపై ఖర్చు చేస్తున్న దానితో పోలిస్తే.. ఈ పెంపు తక్కువగా ఉంటుందని సునీల్ మిట్టల్ అన్నారు. ‘‘జీతాలు పెరిగాయి. అద్దెలు పెరిగాయి. కానీ ఒక్కటి మాత్రం అలాగే ఉంది. దాని గురించి ఎవరూ మాట్లాడరు. ఎలాంటి ఖర్చు చేయకుండానే ప్రజలు 30 జీబీని వాడుకుంటున్నారు’’ అని చెప్పారు. దేశంలో ఓ బలమైన టెలికామ్ కంపెనీ ఉండాల్సిన అవసరం ఉందన్నారు.