Indian Shot Dead: భారతీయుడిని కాల్చి చంపిన ఆస్ట్రేలియా పోలీసులు
- బాధితుడిని తమిళనాడుకు చెందిన అహ్మద్‌గా గుర్తింపు
- క్లీనర్‌పై కత్తితో దాడిచేయడం, పోలీసులను బెదిరించిన ఆరోపణలు
- అహ్మద్ చాతీలోకి దూసుకెళ్లిన మూడు బులెట్లు
- తీవ్రంగా పరిగణించిన ఇండియన్ కాన్సులేట్
బోర్డింగ్ వీసాపై ఆస్ట్రేలియాలో ఉంటున్న ఓ భారతీయుడిని అక్కడి పోలీసులు కాల్చి చంపారు. అతడిని తమిళనాడుకు చెందిన మహమ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్ (32)గా గుర్తించారు. సిడ్నీ రైల్వే స్టేషన్‌లో ఓ క్లీనర్‌ను కత్తితో పొడవడమే కాకుండా, పోలీసులను బెదిరించడంతో అతనిని కాల్చిచంపినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని విచారం వ్యక్తం చేసింది. విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగంతోపాటు పోలీసు అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని తెలిపింది.
‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ న్యూస్ పేపర్ కథనం ప్రకారం.. సిడ్నీ ఆబర్న్ స్టేషన్‌లో అహ్మద్ ఓ క్లీనర్ (28)పై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత ఆబర్న్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్న ఇద్దరు పోలీసులతో ఆయన గొడవకు దిగాడు. ఆపై దాడికి యత్నించాడు. దీంతో పోలీస్ అధికారి అహ్మద్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అందులో రెండు అహ్మద్ ఛాతీలోకి దూసుకెళ్లాయి. దీంతో వెంటనే అతడికి అక్కడే చికిత్స అందించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు.
కాగా, అహ్మద్‌పై కాల్పులు జరపడం తప్ప వేరే మార్గం లేకపోయిందని న్యూ సౌత్‌వేల్స్ పోలీసు అసిస్టెంట్ కమిషనర్ స్టువార్ట్ స్మిత్ పేర్కొన్నారు. మరోపక్క, అహ్మద్ కత్తితో దాడిచేసిన క్లీనర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.