summer: మార్చి తొలి వారం నుంచే ఎండల తీవ్రత.. కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరిక
- వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరిక
- రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు అలర్ట్
- ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ఆరోగ్య శాఖ సూచనలు
దేశవ్యాప్తంగా మార్చి తొలి వారం నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు ఇప్పటికే అసాధారణ స్థాయికి పెరిగాయని పేర్కొంది. వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు పలు సూచనలు చేసింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లకు లేఖలు రాశారు. ఎండ తీవ్రత వల్ల కలిగే అనారోగ్యాలకు సంబంధించి రోజువారీ సర్వీలెన్స్ చర్యలు చేపట్టాలని సూచించారు.
అనారోగ్యాలు, మరణాల వివరాలను మార్చి 1 నుంచి ఎన్ సీడీసీ వెబ్ సైట్లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. నేషనల్ ప్రోగ్రాం ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ జారీ చేసే హీట్ వేవ్ అలర్ట్ లను బట్టి ఆయా ప్రాంతాల అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎండలో పనిచేసేవాళ్లకు, గుండెజబ్బు బాధితులు, హైబీపీ ఉన్నవారు, గర్భిణీలు, వృద్ధులు, పిల్లలకు రిస్క్ ఎక్కువని, వీరి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
ఆరోగ్య శాఖ అడ్వైజరీలో చేసిన సూచనలు..
- నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవాలి. పుచ్చకాయ, దోసకాయ, ఆరెంజ్ వంటి పండ్లను తినడం మంచిది.
- ఎండలో బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే.. నెత్తిన క్యాప్ తో పాటు వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి.
- తరచూ సన్ స్క్రీన్ లోషన్లను ఉపయోగించాలి.. చల్లటి నీటితో స్నానం చేయాలి.
- ఇంట్లో ఎమర్జెన్సీ మెడికల్ కిట్ సిద్ధంగా ఉంచుకోవాలి.
- మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎండలో తిరగొద్దు.
- పార్క్ చేసిన వాహనాలలో పిల్లలను, వృద్ధులను, పెంపుడు జంతువులను వదిలేసి వెళ్లొద్దు.
- ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ డ్రింక్స్ లను వీలైనంత వరకు తాగొద్దు.
- స్పైసీ, ఆయిలీ, మాంసాహారంలను దూరం పెట్టాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తీసుకోవాలి.