Team India: భారత్ తడబాటు.. 45 పరుగులకే సగం జట్టు ఢమాల్
- టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- చెలరేగిపోతున్న ఆసీస్ స్పిన్నర్లు కునెమన్, లయన్
- రోహిత్, గిల్, పుజారా, జడేజా, శ్రేయస్ నిరాశ
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భారత్ తడబడుతోంది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు వికెట్లు టపటపా రాలుతున్నాయి. ఆసీస్ స్పిన్నర్లు కునెమన్, లైయన్ ధాటికి భారత బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. 45 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన భారత్ ఎదురీత మొదలు పెట్టింది. కేఎల్ రాహుల్ స్థానంలో వచ్చిన శుభ్ మన్ గిల్ తో ఓపెనర్ గా వచ్చిన రోహిత్ 12 పరుగులే చేసి ఆరో ఓవర్లో కునెమన్ బౌలింగ్ లో స్టంపౌటయ్యాడు. అతని బౌలింగ్ లోనే గిల్ (21) స్మిత్ కు క్యాచ్ ఇవ్వగా.. తర్వాతి ఓవర్లోనే పుజారా (1)ను నేథన్ లైయన్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఈ దశలో క్రీజులో వచ్చిన విరాట్ కోహ్లీ క్రీజులో కుదురుకున్నా.. వికెట్ల పతనం ఆగలేదు. రవీంద్ర జడేజా (4)ను లైయన్ ఔట్ చేయగా.. శ్రేయస్ అయ్యర్ (0)ను కునెమన్ డకౌట్ చేయడంతో భారత్ 11.2 ఓవర్లలో 45 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ తో కలిసి విరాట్ కోహ్లీ పోరాటం కొనసాగిస్తుండగా.. 18 ఓవర్లకు 66/5 స్కోరుతో నిలిచింది. కోహ్లీ, భరత్ పైనే భారత జట్టు ఆశలు పెట్టుకుంది.