New Delhi: ఢిల్లీ జేఎన్ యూలో ధర్నా చేస్తే రూ. 20 వేల జరిమానా, హింసకు పాల్పడితే అడ్మిషన్ రద్దు!
- 10 పేజీలతో విద్యార్థుల క్రమశిక్షణ, ప్రవర్తన నియమావళి రూపొందించిన యూనివర్సిటీ
- 17 రకాల తప్పిదాలపై చర్యలను పేర్కొన్న పాలక వర్గం
- ఇటీవల బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనపై క్యాంపస్ లో విద్యార్థుల మధ్య గొడవలు
దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ తరచూ వార్తల్లో నిలుస్తుంది. విద్యా, రాజకీయ కారణాలతో యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాలు, ఆందోళనలు చేస్తుంటారు. అవి హింసకు దారితీస్తుంటాయి. అయితే, ఇకపై యూనివర్సిటీలో ధర్నాలు చేసే విద్యార్థులపై రూ. 20 వేల నుంచి రూ. 30 వేల జరిమానా విధించాలని, హింసకు పాల్పడితే అడ్మిషన్ రద్దు చేయాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది.
ఈ మేరకు 10 పేజీల 'విద్యార్థుల క్రమశిక్షణ, ప్రవర్తన నియమావళి’ని జేఎన్ యూ విడుదల చేసింది. ఇందులో ధర్నాలు, ఫోర్జరీ వంటి వివిధ రకాల చర్యలకు శిక్షలు, విచారణ ప్రక్రియలను నిర్దేశించింది. ఇవన్నీ ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. గుజరాత్ అల్లర్ల విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శనపై విశ్వవిద్యాలయంలో గొడవలు జరగడంతో కఠిన నిబంధనలు అమలు చేయాలని జేఎన్ యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది.
ఈ నిబంధనలు పార్ట్ టైమ్ విద్యార్థులు సహా అందరికీ వర్తిస్తాయని పేర్కొంది. జేఎన్ యూ ప్రాంగణాన్ని బ్లాక్ చేయడం, జూదం ఆడటం, హాస్టల్ గదులను అనధికారికంగా ఆక్రమించడం, దుర్వినియోగం, అవమానకరమైన పదజాలం ఉపయోగించడం, ఫోర్జరీ చేయడం వంటి 17 నేరాలకు విధించే శిక్షలను ఇందులో చేర్చారు. ఫిర్యాదుల కాపీని విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా పంపుతామని నిబంధనలలో పేర్కొన్నారు. ఈ నిబంధనలపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జేఎన్ యూ కార్యదర్శి వికాస్ పటేల్ కొత్త నిబంధనలను 'తుగ్లక్’ చర్య అన్నారు.