Electric: ఎలక్ట్రిక్ టూ వీలర్లలో.. మూడు కంపెనీలదే ఆధిపత్యం!
- మొదటి స్థానంలో ఓలా ఎలక్ట్రిక్
- టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ ఎన్జీలు తర్వాతి స్థానం
- హీరో ఎలక్ట్రిక్, యాంపియర్ ఫర్వాలేదు
దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో కేవలం మూడు కంపెనీలు మెజారిటీ వాటాను (60 శాతానికి పైనే) ఆక్రమిస్తున్నాయి. అన్నింటికంటే ఓలా ముందుంది. ఫిబ్రవరి నెల వాహన అమ్మకాల గణాంకాలు విడుదలయ్యాయి. ఇందులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వరకే తీసుకుంటే మొత్తం 65,000 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇందులో 17,616 యూనిట్లను ఓలా విక్రయించింది. ఓలా స్కూటర్లలో సమస్యలు, ముందు సస్పెన్షన్ విరిగిపోవడం ఇలాంటి అంశాలేవీ ఆ సంస్థ అమ్మకాలకు అవరోధంగా లేవని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఓలా 17,616 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తే, టీవీఎస్ మోటార్ కంపెనీ (ఐక్యూబ్) 12,568 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఏథర్ ఎనర్జీ సైతం 9,956 యూనిట్లను విక్రయించింది. అంటే ఈ మూడు కంపెనీలు కలసి మొత్తం 40,143 యూనిట్లను విక్రయించాయి. హీరో ఎలక్ట్రిక్ 5,855 యూనిట్లు, యాంపియర్ 5,835 యూనిట్లు, ఒకినవా ఆటోటెక్ 3,840 యూనిట్లు, చేతక్ 1,305 యూనిట్లు చొప్పున విక్రయించాయి. ఒకాయా 1,231 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఈ విభాగంలోకి ఇటీవలే ప్రవేవించిన అగ్రగామి టూవీలర్ల కంపెనీ హీరో మోటకార్ప్.. విదా ఎలక్ట్రిక్ స్కూటర్లు 299 యూనిట్లనే అమ్ముకోగలిగింది.