Amazon Rainfore: అమెజాన్ అడవుల్లో తప్పిపోయి.. పురుగులు తిని బతికిన వ్యక్తి
- బొలీవియాకు చెందిన వ్యక్తికి ఎదురైన అనుభవం
- స్నేహితులతో కలసి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో పర్యటించిన జోనాదన్
- దారితప్పడంతో ప్రాణాలతో బయటపడేందుకు పోరాటం
అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. వన్యప్రాణుల ప్రేమికులకు ఇది స్వర్గం వంటిది. 6.7 మిలియన్ చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన అడవి ఇది. భూమిపై ఉన్న జంతు, జీవ జాలంలో 10 శాతానికి ఈ అడవే ఆధారం. అంతేకాదు 4.7 కోట్ల మంది ప్రజలు కూడా అక్కడక్కడా నివసిస్తుంటారు. మరోపక్క, ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం కూడా. ఇక్కడ ఒంటరిగా తప్పిపోతే ప్రాణాలతో బయటపడడం అదృష్టమే అవుతుంది. ఇప్పుడు 30 ఏళ్ల బొలీవియన్ వాసి జోనాదన్ అకోస్టాకి ఇదే జరిగింది. అడవిలో తప్పిపోయి 31 రోజుల తర్వాత ఆయన అక్కడి నుంచి బయటపడ్డారు.
నార్తర్న్ బొలీవియాలో తన స్నేహితుల బృందం నుంచి ఆయన తప్పిపోయారు. బతికేందుకు పురుగులు, కీటకాలు తిని, కాలికి ఉన్న షూ తీసి అందులో వర్షపు నీరు పట్టుకుని తాగినట్టు జోనాదన్ తన కథనాన్ని యూనీటెల్ టీవీతో పంచుకున్నారు. మరోవైపు ప్రమాదకరమైన జంతువుల నుంచి కాపాడుకోవడం కూడా ఆయనకు పెద్ద సవాలుగా మారింది. జోనాదన్ తప్పిపోవడంతో ఆయన కోసం కుటుంబ సభ్యులు వెంటనే అన్వేషణ ప్రారంభించారు. చివరికి 31 రోజుల తర్వాత అమెజాన్ అడవుల్లో ఆయన్ని గుర్తించారు. వంట్లో తగినంత నీరు, లవణాలు లేక, నీరసించిపోయి, 17 కిలోల బరువు తగ్గిపోయిన స్థితిలో జోనాదన్ కనిపించారు.