West Bengal: 2024 లోక్ సభ ఎన్నికలలో పోటీపై మమతా బెనర్జీ సంచలన ప్రకటన

Will Fight Alone says Mamata Banerjee and Rules Out Any Alliance For 2024

  • టీఎంసీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్న బెంగాల్ ముఖ్యమంత్రి
  • ఏ పార్టీతోనే పొత్తు ఉండదని, ప్రజల మద్దతుతో ముందుకెళ్తామని వ్యాఖ్య
  • బీజేపీతో పని చేస్తున్న కాంగ్రెస్, సీపీఎం మాట వినేది లేదని స్పష్టీకరణ

వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో జట్టు కట్టాలని పలు ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీని ఓడించేందుకు ఇతర పార్టీల మద్దతు కూడగట్టాలని కాంగ్రెస్ కూడా కోరుకుంటోంది. విపక్షాలు ఏకం అయితేనే బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తుండగా... తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం సంచలన ప్రకటన చేశారు. 

వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో టీఎంసీ ఒంటరిగా పోరాడుతుందని స్పష్టం చేశారు. దాంతో, 2024లో ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పాటు కాకముందే రాష్ట్రంలోని 42 (బెంగాల్ లోక్ సభ స్థానాలు) సీట్ల విషయంలో అనిశ్చితి ఏర్పడింది. సీపీఎం, కాంగ్రెస్‌లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయని మమత ఆరోపించారు. ‘అపవిత్ర పొత్తులుంటే బీజేపీతో కాంగ్రెస్ ఎలా పోరాడుతుంది? వామపక్షాలు బీజేపీతో ఎలా పోరాడతాయి? సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలు బీజేపీకి వ్యతిరేకం అని ఎలా చెప్పుకుంటాయి?’ అని ఆమె ప్రశ్నించారు. 

బెంగాల్‌లోని సర్దిఘిలో జరిగిన ఉపఎన్నికలో, అధికార తృణమూల్ ను కాంగ్రెస్ అభ్యర్థి ఓడించిన విషయం గురించి ఆమె ప్రస్తావించారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ అన్నీ మతం కార్డు ఉపయోగించాయని మమత ఆరోపించారు. బీజేపీ బహిరంగ ఆట ఆడితే.. సీపీఎం, కాంగ్రెస్ మరింత ఎక్కువగా మతం కార్డు వాడటమే ఇక్కడ తేడా అన్నారు. దాంతో, సీపీఎం, కాంగ్రెస్‌ మాటలు వినకూడదని, బీజేపీతో కలిసి పనిచేసే వారితో పొత్తు పెట్టుకోకూడదని గుణపాఠం తెలిసిందన్నారు. 

‘2024లో తృణమూల్, ప్రజల మధ్య పొత్తును మాత్రమే చూస్తాం. మేం ఇతర రాజకీయ పార్టీలతో కలిసి వెళ్లం. ప్రజల మద్దతుతో ఒంటరిగా పోరాడతాం’ అని మమత స్పష్టం చేశారు. కాగా, 2019 ఎన్నికల్లో విపక్షాల కూటమిలో మమత కీలకంగా వ్యవహరించారు. కానీ, ఆ కూటమికి చుక్కెదురైంది. బెంగాల్ లో బీజేపీ 42 లోక్ సభ స్థానాల్లో 18 స్థానాలను గెలుచుకొని రాష్ట్రంలో విస్తరించింది.

  • Loading...

More Telugu News