Love Jihad: ప్రేమికులు వేర్వేరు మతాలకు చెందినంత మాత్రాన లవ్ జిహాద్‌గా చూడలేం: బాంబే హైకోర్టు స్పష్టీకరణ

Just because boy and girl are from different religions it is not Love Jihad says Bombay HC

  • ఇస్లాంలోకి మారి సున్తీ చేయించుకోమన్నారని యువకుడి ఆరోపణ
  • ‘లవ్ జిహాద్’ కేసుగా అభివర్ణించిన యువకుడి తరపు న్యాయవాది
  • ఆ రంగు పులిమే ప్రయత్నం చేయొద్దన్న న్యాయస్థానం
  • యువతి, ఆమె కుటుంబ సభ్యులకు ముందస్తు బెయిలు మంజూరు

ప్రేమలో ఉన్న ఇద్దరు యువతీయువకులు వేర్వేరు మతాలకు చెందినవారన్న ఒకే ఒక్క కారణంతో దానిని ‘లవ్ జిహాద్’గా పరిగణించలేమని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. ముస్లిం యువతి, ఆమె కుటుంబ సభ్యులకు బెయిలు మంజూరు చేసింది. వారికి బెయిలు నిరాకరిస్తూ ఫిబ్రవరి 26న స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ విభా కన్కవాడి, జస్టిస్ అభయ్ వాఘ్వాసేలతో కూడిన డివిజన్ బెంచ్  రద్దు చేసింది.

మాజీ ప్రేయసి, ఆమె కుటుంబ సభ్యులు యువకుడిని ఇస్లాంలోకి మారమన్నారని, సున్తీ చేయించుకోమన్నారని యువకుడి తరపు న్యాయవాది ఆరోపించాడు. కాబట్టి యువతి, ఆమె కుటుంబ సభ్యులు పెట్టుకున్న ముందస్తు బెయిలు దరఖాస్తును తిరస్కరించాలని అభ్యర్థించారు. అంతేకాదు, దీనిని ‘లవ్ జిహాద్’  కేసుగా అభివర్ణించారు. 

అయితే, ఆయన వాదనను కోర్టు కొట్టివేసింది. ఎఫ్ఐఆర్ ప్రకారం.. యువకుడు ఆమెతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని, ఆ తర్వాత పలు అవకాశాలు వచ్చినప్పటికీ ఆమెతో అతడు తెగదెంపులు చేసుకోలేదని కోర్టు ఎత్తిచూపింది. ఇప్పుడు దీనికి లవ్ జిహాద్ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రేమను అంగీకరించినప్పుడు అతడు ఇరుక్కుపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయని వ్యాఖ్యానించింది. 

యువతీయువకులు ఇద్దరూ మార్చి 2018 నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఆ విషయాన్ని ఆమెతో ఎప్పుడూ పంచుకోలేదు. ఇస్లాంలోకి మారి తనను పెళ్లి చేసుకోవాలంటూ యువకుడిని ఆమె బలవంతం చేసినప్పుడు మాత్రమే అతడు తన కులాన్ని బయటపెట్టాడు. 

అయినప్పటికీ అమ్మాయి తల్లిదండ్రులు అతడిని వ్యతిరేకించలేదు సరికదా ఆమెను కూడా ఒప్పించారు. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య చెడడంతో కేసులు పెట్టుకోవడం వరకు వెళ్లింది. యువతి, ఆమె కుటుంబ సభ్యులకు బెయిలు మంజూరు చేసిన కోర్టు.. దర్యాప్తు దాదాపు ముగిసిందని, కాబట్టి కస్టడీ అవసరం లేదని తేల్చి చెప్పింది.

  • Loading...

More Telugu News