Nithyananda: నిత్యానందను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలి: కైలాస దేశ ప్రతినిధి
- ఐక్యరాజ్యసమితిలో తన ప్రకటనను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారన్న విజయప్రియ
- భారత్ లో హిందూ వ్యతిరేక మీడియా సంస్థల పనిగా ఆరోపణ
- భారత్ ను గురుపీఠంగా భావిస్తామని స్పష్టీకరణ
భారత్ అంటే తమకు ఎంతో గౌరవమని, గురుపీఠంగా భావిస్తామని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశ ప్రతినిధి విజయ్ ప్రియ నిత్యానంద పేర్కొన్నారు. భారత్ లో హిందూ వ్యతిరేక శక్తులు నిత్యానందను వేధించాయని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా.. కైలాస దేశ రాయబారిగా చెప్పుకుంటున్న విజయప్రియ నిత్యానంద .. స్వామి నిత్యానందను భారత్ లో హిందూ వ్యతిరేక శక్తులు వేధించాయని, దేశం నుంచి ఆయన్ను నిషేధించాయని చెప్పడం తెలిసిందే.
అయితే దీనిపై విజయ ప్రియ తాజాగా వివరణ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితిలో తన ప్రకటనను భారత్ లోని కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు తప్పుగా అన్వయించడమే కాకుండా, ఉద్దేశపూర్వకంగా మార్చినట్టు, వక్రీకరించినట్టు ఆరోపించారు. ‘‘ఎస్ పీహెచ్ భగవాన్ నిత్యానంద పరమశివమ్ ను ఆయన మాతృభూమిలో కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు వేధింపులకు గురి చేశాయి. మా ఆందోళన అంతా కూడా సంబంధిత హిందూ వ్యతిరేక శక్తుల గురించే. హిందూ మతం, కైలాస దేశ పీఠాధిపతికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తున్న అలాంటి శక్తులపై భారత్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’’ అని విజయ ప్రియ ప్రకటించారు.