Sonia Gandhi: సోనియాగాంధీకి అస్వస్థత.. గంగారామ్ ఆసుపత్రికి తరలింపు

Sonia Gandhi admitted in hospital

  • బ్రాంకైటిస్ తో బాధపడుతున్న సోనియాగాంధీ
  • నిన్ననే హాస్పిటల్ లో చేర్పించిన వైనం
  • సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. ఆమె బ్రాంకైటిస్ (శ్వాసనాళాల వాపు) తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. 76 ఏళ్ల సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. వాస్తవానికి ఆమె నిన్ననే ఆసుపత్రిలో చేరినప్పటికీ... ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. 

గురువారం (నిన్న) నాడు సోనియాగాంధీ ఆసుపత్రిలో చేరారని గంగారాం హాస్పిటల్ అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు ఆసుపత్రి ఛైర్మన్ డీఎస్ రాణా మాట్లాడుతూ, జ్వరం లక్షణాలతో ఆమె ఆసుపత్రికి వచ్చారని... చెస్ట్ మెడిసిన్ డిపార్ట్ మెంట్ సీనియర్ కన్సల్టెంట్ ఆరుప్ బసు నేతృత్వంలోని వైద్య బృందం ఆమెను పర్యవేక్షిస్తోందని చెప్పారు.

ప్రస్తుతం సోనియాకు చికిత్స కొనసాగుతోందని, ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచామని గంగారామ్ ఆసుపత్రి వైద్యులు బులెటిన్ లో తెలిపారు. ఈ ఏడాది ఆమె ఆసుపత్రిలో చేరడం ఇది రెండో సారి. జనవరిలో శ్వాసకు సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె హాస్పిటల్ లో చేరారు. మరోవైపు, సోనియా ఆసుపత్రిలో చేరారనే వార్తతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.

  • Loading...

More Telugu News