Sunil Gavaskar: ఇండోర్ టెస్టులో టీమిండియా కొంపముంచింది అదే: గవాస్కర్

Gavaskar opines on Team India loss against Australia
  • ఆసీస్ తో మూడో టెస్టులో భారత్ ఘోర పరాజయం
  • ఇండోర్ లో 9 వికెట్ల తేడాతో నెగ్గిన ఆసీస్
  • ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో జడేజా నోబాల్ వేశాడన్న గవాస్కర్
  • లబుషేన్ బతికిపోయాడని వెల్లడి
  • ఖవాజాతో కలిసి 96 పరుగులు జోడించాడని వివరణ
స్వదేశంలో టీమిండియా టెస్టుల్లో ఓడిపోవడం అరుదైన విషయం. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత్ ఓటమిపాలైంది. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ మూడో రోజు తొలి సెషన్ కే ముగిసింది. టీమిండియా టెస్టు చరిత్రలో అత్యంత ఘోర పరాజయాల్లో ఇండోర్ టెస్టు కూడా ఒకటిగా నిలిచిపోతుంది. 

ఈ టెస్టులో టర్నింగ్ పాయింట్ ఏమిటన్నది క్రికెట్ దిగ్గజం, వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ వివరించారు. జడేజా విసిరిన ఓ నోబాల్ కొంపముంచిందని అభిప్రాయపడ్డారు. 

"ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆడేటప్పుడు మార్నస్ లబుషేన్ బ్యాటింగ్ కు వచ్చాడు. అతడు ఖాతా తెరవకముందే జడేజా బౌలింగ్ లో అవుటైనా, జడేజా విసిరింది నోబాల్ అని టీవీ అంపైర్ తేల్చాడు. దాంతో లబుషేన్ బతికిపోయాడు. 

అతడు వ్యక్తిగతంగా 31 పరుగులు చేయడంతో పాటు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఎంతో విలువైన 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మ్యాచ్ లో టీమిండియా పట్టు కోల్పోయింది ఇక్కడే. ఆ బంతి గనుక నోబాల్ కాకపోయుంటే లబుషేన్ సున్నా పరుగులకే అవుటై ఉండేవాడు. అందుకే జడేజా విసిరిన ఆ నోబాల్ టీమిండియా ఓటమికి కారణమైందని చెబుతాను" అని గవాస్కర్ వివరించారు.

ఇండోర్ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే అనూహ్య రీతిలో తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 197 పరుగులు చేసి కీలక ఆధిక్యాన్ని పొందింది. 

రెండో ఇన్నింగ్స్ లోనూ టీమిండియా ఆటతీరు మెరుగుపడలేదు. పుజారా అర్ధసెంచరీ సాయంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులు చేయగలిగింది. ఆసీస్ ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యం నిలవగా... 1 వికెట్ నష్టానికి ఛేదించిన ఆసీస్ ఈ టెస్టులో 9 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.
Sunil Gavaskar
Team India
Indore Test
Australia
Ravindra Jadeja
No Ball

More Telugu News