Australia: ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై కొనసాగుతున్న దాడి..ఈసారి బ్రిస్బేన్‌లో!
- శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయంపై దాడి
- ప్రహరీని ధ్వంసం చేసిన దుండగులు
- ఖలిస్థాన్ అనుకూల వాదుల పనేనన్న ‘ఆస్ట్రేలియా టుడే’
ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడి కొనసాగుతోంది. ఈసారి బ్రిస్బేన్ ఆలయంపై దాడి చేసిన దుండగులు గోడలను ధ్వంసం చేశారు. ఈ తెల్లవారుజామున ఆలయానికొచ్చిన భక్తులు విధ్వంసాన్ని గుర్తించారు. దక్షిణ బ్రిస్బేన్‌లోని బుర్‌బ్యాంక్ శివారులో ఉన్న శ్రీలక్ష్మీ నారాయణ ఆలయంపై దాడి జరిగినట్టు ‘ఆస్ట్రేలియా టుడే’ తెలిపింది. ఖలిస్థాన్ అనుకూల వాదులే ఈ దాడికి దిగినట్టు ఆరోపించింది.
ఆలయ అధ్యక్షుడు సాతిందర్ శుక్లా ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఆలయ పూజారి, భక్తులు ఈ ఉదయం తనకు ఫోన్ చేసి ఆలయ ప్రహరీపై జరిగిన దాడి గురించి చెప్పినట్టు పేర్కొన్నారు. పోలీసు అధికారులతో ఆలయ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇంతకుముందు బ్రిస్బేన్‌లోని గాయత్రి మందిర్‌పై దాడి చేస్తామంటూ పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన ఖలిస్థాన్ తీవ్రవాదుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి.
ఆస్ట్రేలియాలోని హిందువులను భయపెట్టేందుకు సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) చేస్తున్న పద్ధతిలోనే తాజా ద్వేషపూరిత దాడులు జరుగుతున్నాయని హిందూ హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ సారా ఎల్ గేట్స్ ఆరోపించారు.