EPFO: అధిక పింఛను కోరుకునే వారికి ఈపీఎఫ్ వో కొర్రీలు
- గతంలోనే అనుమతి తీసుకుని ఉండాలన్న షరతు
- వాస్తవ వేతనంపై చందా చెల్లిస్తున్న వారికి నిరాశ
- సుప్రీంకోర్టు ఆదేశాలను యథాతథంగా అమలు చేస్తే అధిక పింఛనుకు అవకాశం
అధిక పింఛను కోరుకునే వారికి ఉపశమనంగా సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ఫలితాన్ని, ఉద్యోగులకు అందకుండా చేసేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ వో) ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2014 సెప్టెంబర్ 1 నాటికి ఈపీఎఫ్ వో సభ్యులుగా చేరి, సర్వీసులో కొనసాగుతున్న వారికి అధిక పింఛను ఆప్షన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు గతేడాది నవంబర్ లో ఆదేశాలు జారీ చేసింది. 2014 సెప్టెంబర్ 1కి ముందు రిటైర్మెంట్ తీసుకున్న వారికి కూడా అవకాశం కల్పించాలన్నది ఆదేశాల సారం.
2014 సెప్టెంబర్ 1 నుంచి ఈపీఎఫ్ వో కింద ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని రూ.15,000కు (మూల వేతనం, కరువు భత్యం) పెంచారు. నాడు ఆ గరిష్ఠ పరిమితి అయిన రూ.15,000 కంటే ఎక్కువ వేతనం పొందుతున్న వారు, వాస్తవ వేతనంపై ఈపీఎఫ్, ఈపీఎస్ చందా చెల్లించేందుకు ఆప్షన్ ఇచ్చుకోవడానికి ఈపీఎఫ్ వో అనుమతించింది. కొందరు ఆప్షన్ ఇచ్చుకున్నారు. కొందరు ఇచ్చుకోలేదు. ఆప్షన్ ఇచ్చుకోని వారు ఇప్పుడు ఆ పని చేయడం ద్వారా భవిష్యత్తులో పదవీ విరమణ అనంతరం అధిక పింఛను పొందొచ్చు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధిక పింఛను ఆప్షన్ కు ఈపీఎఫ్ వో వెబ్ లింక్ ను తీసుకొచ్చింది. కొన్ని షరతులు(కొర్రీలు) వేసింది. పేరా 26(6) కింద అధిక వేతనంపై చందాలు చెల్లించేందుకు నాడు ఈపీఎఫ్ వో అనుమతి తీసుకుని ఉండాలన్నది షరతు. అంటే 2014 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన రూ.15వేల పరిమితి కంటే ఎక్కువ వేతనం పొందుతూ, వాస్తవ వేతనం ఆధారంగా అధిక జమలు చేస్తున్న వారు.. ఇప్పుడు నాడు తీసుకున్న అనుమతి పత్రం జత చేస్తేనే, అధిక పింఛను దరఖాస్తుకు ఆమోదం లభిస్తుందని ఈపీఎఫ్ వో చెబుతోంది.
సుప్రీంకోర్టు ఆదేశాలను ఉన్నది ఉన్నట్టుగా అమలు చేస్తే.. అధిక పింఛను ఆప్షన్ ఇచ్చి, వాస్తవ వేతనం ఆధారంగా ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కు చందా జమ చేస్తే.. రిటైర్మెంట్ కు ముందు ఐదేళ్ల కాలంలో పొందిన సగటు నెలవారీ వేతనంలో 50 శాతం పింఛనుగా లభిస్తుంది. ఇది ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరం. ఆర్థికంగా భారం పడే ఈ విధానాన్ని నీరుగార్చాలన్నది ఈపీఎఫ్ వో వైఖరిగా కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి.