Bopparaju: మా ఉద్యమానికి అనవసర అపవాదులు అంటించొద్దు: బొప్పరాజు
- మార్చి 9 నుంచి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమం
- కార్యాచరణ షెడ్యూల్ ను ఇదివరకే ప్రకటించిన ఏపీ జేఏసీ
- తమను ఎలాంటి శక్తులు నడిపించడంలేదన్న బొప్పరాజు
- తమది ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కాదని స్పష్టీకరణ
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మార్చి 9 నుంచి ఏప్రిల్ 3 వరకు తొలి దశ ఉద్యమం ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 5న పరిస్థితిని సమీక్షించి రెండో దశ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
అయితే, తమ వెనుక ఎలాంటి శక్తులు లేవని, తమను ఎవరూ నడిపించడంలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి బాధ్యతలను గుర్తు చేసేందుకే తాము ఉద్యమం చేస్తున్నాం తప్ప, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కాదని అన్నారు. తమ ఉద్యమానికి అనవసర అపవాదులు అంటించవద్దని బొప్పరాజు హితవు పలికారు. తాము న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని వివరించారు.
ఉద్యోగులు ప్రభుత్వంలో కుటుంబ సభ్యుల వంటివారేనని, ఉద్యోగులు సంతోషంగా ఉన్నప్పుడే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తారని పేర్కొన్నారు.