Tamilnadu: తమిళనాడులో ముదురుతున్న ఉత్తరాది కూలీలపై దాడి వివాదం
- తమిళనాడులో ఉత్తరాది వారిపై దాడుల ఫేక్ వీడియోలు వైరల్
- భయాందోళనలతో రాష్ట్రాన్ని వీడుతున్న ఉత్తరాది కూలీలు
- ఇతర రాష్ట్రాల వారికి పూర్తి భద్రత కల్పిస్తామంటూ సీఎం స్టాలిన్ భరోసా
- ఫేక్ వీడియోల వ్యాప్తికి కారణమైన వారిపై కఠిన చర్యలకు ఆదేశం
తమిళనాడులో ఉత్తరాది వలస కార్మికులపై స్థానికుల దాడి వివాదం ముదురుతోంది. ఈ విషయమై కొన్ని నకిలీ వీడియోలు కూడా వైరల్ కావడంతో ఉత్తరాది కార్మికులు భయాందోళనలకు లోనై రాష్ట్రాన్ని వీడుతున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఫేక్ వీడియోల వ్యాప్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో ఏ రాష్ట్రానికి చెందిన వారికైనా పూర్తి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఉత్తరాది వారిపై దాడులు జరిగాయంటూ ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాది కూలీలపై తమిళులు దాడులకు దిగుతున్నారంటూ విషప్రచారానికి దిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫేక్ వీడియోలు నమ్మి ఎవరూ భయాందోళలనలకు లోను కావద్దని స్టాలిన్ సూచించారు.
సీఎం ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఉత్తరాది కూలీలు ఎక్కువగా ఉండే కోయంబత్తూర్, తిరుప్పూర్ జిల్లాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారితో అధికారులు సమావేశమయ్యారు. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేశారు.
ఇక ఉత్తరాది కూలీలపై దాడి ఘటనలో నిజానిజాలు వెలికి తీసేందుకు బీహార్ అధికారులు తమిళనాడుకు చేరుకున్నారు. ఆదివారం వారు కోయంబత్తూర్, తిరుప్పూర్ జిల్లాల్లో పర్యటించనున్నారు.