Turbulence: గాల్లో ఎగురుతున్న విమానంలో భారీ కుదుపులు! ప్రయాణికుడి దుర్మరణం
- టర్బులెన్స్ కారణంగా అమెరికా విమానంలో కుదుపులు
- ప్రయాణికుడి దుర్మరణం
- ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన ఎన్టీఎస్బీ
గాల్లో ఎగురుతున్న విమానం అకస్మాత్తుగా కుదుపులకు లోనవడంతో ఓ ప్రయాణికుడు దుర్మరణం చెందాడు. అమెరికాలోని ఓ ప్రైవేటు సంస్థకు చెందిన విమానంలో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. గగనతలంలో టర్బులెన్స్ కారణంగా విమానం కుదుపులకు లోనైంది. గాలి ప్రవాహంలో ఆకస్మిక మార్పులను టర్బులెన్స్ అంటారు. విమానం కుదుపులకు లోనైనప్పుడు కొన్ని సమయాల్లో ప్రయాణికులు గాయాలపాలవుతారు.
మిస్సోరీలోని కానేక్సాన్ సంస్థకు చెందిన తేలికపాటి విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రమాదసమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది. కీన్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన విమానం 20 నిమిషాలకే బ్రాడ్లే విమానాశ్రయంలో అత్యవసరంగా లాండైంది. అప్పటికే అక్కడకు చేరుకున్న ప్యాసింజర్లను ఆసుపత్రికి తరలించారు.
అయితే.. ప్రయాణికుడు ఎలా మరణించాడో ఇప్పుడే చెప్పలేమని అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డు(ఎన్టీఎస్బీ) ఓ ప్రకటనలో పేర్కొంది. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన ఎన్టీఎస్బీ..విమానంలో బ్లాక్ బాక్స్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను స్వాధీనం చేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విమాన సిబ్బంది, ఇతర ప్రయాణికులను ప్రశ్నిస్తోంది.