Pulwama: ఆదుకోవట్లేదు, ఆత్మహత్యకైనా అనుమతివ్వండి.. రాజస్థాన్ గవర్నర్ కు అమరవీరుల భార్యల విజ్ఞప్తి!

Widows of Pulwama CRPF jawans met Rajasthan Governor seeking permission to commit suicide

  • పుల్వామా దాడిలో చనిపోయిన జవాన్లకు నేటికీ అందని పరిహారం
  • కొన్నిరోజులుగా ధర్నా చేస్తున్న అమరజవాన్ల కుటుంబ సభ్యులు
  • రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు వినతిపత్రం అందించిన అమరవీరుల భార్యలు

దేశ రక్షణలో తమ భర్తలు ప్రాణాలు వదిలారు.. మూడేళ్లు గడిచినా ప్రభుత్వం మాత్రం పరిహారం ఇవ్వడంలేదని పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల భార్యలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్ కు చెందిన అమరవీరుల భార్యలు ముగ్గురు గవర్నర్ ను కలిశారు. పుల్వామా దాడిలో తమ భర్తలు అమరులై మూడేళ్లు గడిచిందని గుర్తుచేశారు. అప్పుడు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. కానీ ఇప్పుడు తమను పట్టించుకోవడంలేదని ముగ్గురు అమరవీరుల భార్యలు చెప్పారు. ప్రభుత్వం ఆదుకోవట్లేదు.. ఆత్మహత్య చేసుకోవడానికైనా అనుమతివ్వాలని గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు వినతిపత్రం అందజేశారు.

పుల్వామాలో టెర్రరిస్టులు జరిపిన దాడిలో 40 మంది సీఆర్ పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన జరిగి మూడేళ్లు గడిచింది. రాజస్థాన్ కు చెందిన అమరుల భార్యలకు నేటికీ పరిహారం అందలేదు. దీంతో ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొన్ని రోజులుగా వీర జవాన్ల భార్యలు ధర్నా చేస్తున్నారు. మరణించిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల భార్యలు, కుటుంబ సభ్యులు తాజాగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ ను కలిశారు.

తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం, తమ భర్తల పేరిట స్మారకాలు నిర్మిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వాటిని అమలు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నేరుగా రాజస్థాన్‌ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించిన బాధితులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు తోసేయడంతో వీర జవాన్‌ రోహితాశవ్ లాంబా భార్య మంజు గాయపడినట్లు మరో జవాన్‌ భార్య ఆరోపించారు.

  • Loading...

More Telugu News