Zoom: ప్రముఖ ఎంఎన్‌సీ సంచలన నిర్ణయం.. ఏకంగా అధ్యక్షుడి తొలగింపు

Zoom abruptly fires its president Greg Tomb

  • కంపెనీ అధ్యక్షుడిని అకస్మాత్తుగా తొలగించిన జూమ్
  • అధ్యక్ష బాధ్యతలు తీసుకుని ఏడాది కాకమునుపే తొలగింపు
  • తొలగింపునకు కారణం వెల్లడించని జూమ్

ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ సంస్థ జూమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థ అధ్యక్ష బాధ్యతల నుంచి గ్రెగ్ టాంబ్‌ను తొలగించినట్టు పేర్కొంది. రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లో సంస్థ ఈ మేరకు ప్రభుత్వానికి తెలిపింది. గ్రెగ్ తొలగింపునకు కారణమేంటో జూమ్ వెల్లడించకపోవడం పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. గ్రెగ్‌ గతేడాది జూన్‌లో జూమ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పదవిలో చేరి ఏడాది కూడా గడవక మునుపే ఆయనను జూమ్ తొలగించింది. అధ్యక్ష బాధ్యతలను మరొకరికి అప్పగించే ఆలోచన ప్రస్తుతానికి తమకు లేదని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. 

గత నెలలో ఏకంగా 1300 పైచిలుకు సిబ్బందిని తొలగించిన జూమ్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా కంపెనీ అధ్యక్షుడినే విధుల నుంచి తొలగించిన సంస్థ మరోసారి వార్తల్లోకెక్కింది. ఇక.. గ్రెగ్ 2019లో జూమ్‌లో చీఫ్ రెవెన్యూ ఆఫీసర్‌గా చేరారు. ఆ తరువాత ఎనిమిది నెలలకు అధ్యక్షుడిగా పదోన్నతి పొందారు. జూమ్‌లో చేరక మునుపు గ్రెగ్ గూగుల్‌లో సేల్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 

ఇక గత నెలలో ఉద్యోగుల తొలగింపును ప్రకటించిన జూమ్ సీఈఓ ఎరిక్ యువాన్..ఉద్యోగుల్లో 15 శాతం మందికి ఉద్వాసన తప్పదని పేర్కొన్నారు. ఫలితంగా 1300 మంది తమ జాబ్స్ పోగొట్టుకున్నారు. అంతేకాకుండా.. తన శాలరీలోనూ 98 శాతం మేర కోత విధించుకున్నట్టు తెలిపారు. ఏటా తనకు ఇచ్చే కార్పొరేట్ బోనస్‌ను వదులుకున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News