Virat Kohli: కోహ్లీని ఎందుకు పొగడొద్దు.. షోయబ్ అక్తర్
- కోహ్లీపై మరోసారి షోయబ్ అక్తర్ ప్రశంసలు
- 40కి పైగా సెంచరీలు చేజింగ్ సమయంలోనే చేశాడని వ్యాఖ్య
- అప్పట్లో విరాట్ సెంచరీలతోనే భారత జట్టు విజయం సాధించేదని వెల్లడి
విరాట్ కోహ్లీ.. ప్రస్తుత క్రికెట్ యుగంలో అత్యుత్తమ బ్యాట్స్ మన్లలో ఒకడు. టీమిండియాలో గవాస్కర్, సచిన్ తర్వాత పరుగుల యంత్రంగా పేరుపొందాడు. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులు ఉన్నారు. అతడి ఆటతీరును ప్రశంసించే తోటి క్రికెటర్లూ ఉన్నారు. ఇక పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. వీలు దొరికినప్పుడల్లా కోహ్లీ గురించి మాట్లాడుతుంటాడు. తాజాగా మరోసారి కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తాడు.
ఓ న్యూస్ చానల్ తో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. ‘‘చూడండి.. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ అని నేను నమ్ముతా. కానీ కెప్టెన్ గా అతడు విఫలమయ్యాడు. దాంతో కెప్టెన్సీని తానే వదిలేశాడు. కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లీకి ఇలానే జరిగింది. ఎప్పుడైతే కెప్టెన్సీ భారం నుంచి ఫ్రీ అయ్యాడో.. అప్పుడే ఫామ్ లోకి వచ్చేశాడు’’ అని వివరించాడు.
గత టీ20 ప్రపంచకప్ లో విరాట్ ప్రదర్శన చూస్తే ఫామ్ లోకి వచ్చాడన్న విషయం అర్థమైపోతుందని చెప్పాడు. కోహ్లీ ఫామ్ లోకి రావడానికి దేవుడే ఆ టోర్నమెంట్ జరిగేలా చేశాడేమో అంటూ వ్యాఖ్యానించాడు.
‘‘ఒక్కసారి విరాట్ రికార్డులు గమనించండి. అతడు సాధించిన సెంచరీల్లో దాదాపు 40కి పైగా చేజింగ్ సమయంలోనే చేశాడు. ఒకానొక సమయంలో విరాట్ సెంచరీలతోనే భారత జట్టు విజయం సాధించేది’’ అని షోయబ్ అక్తర్ తెలిపాడు. ‘‘విరాట్ కోహ్లీని ఎందుకు ఎక్కువగా పొగుడుతుంటావు అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. ఎందుకు మెచ్చుకోకూడదని నేను తిరిగి ప్రశ్నిస్తా’’ అని అక్తర్ అన్నాడు.