ponguleti srinivas reddy: హిప్నాటిజం చేయడంలో కేసీఆర్ దిట్ట: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- జెండా ఏదైనా బీఆర్ఎస్ను గద్దె దించటమే నా అజెండా: పొంగులేటి
- ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపణ
- మాయ మాటలు చెప్పి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని మండిపాటు
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలపై ఆ పార్టీ రెబల్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఖమ్మం పాలిటిక్స్‌లో కీలక నేత అయిన మాజీ ఎంపీ పొంగులేటి.. కొంత కాలంగా బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వంపై వీలు చిక్కినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఆదివారం పాలేరులో జరిగిన అత్మీయ సమావేశంలో మరోసారి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రజలను హిప్నాటిజం చేయడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడతాయని అనుకుంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిందన్నారు. రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన యువకుల త్యాగాలకు విలువ లేకుండా పోయిందని చెప్పారు. ధనిక రాష్ట్రం కాస్తా అప్పుల రాష్ట్రంగా మారిందని విమర్శించారు.
ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని పొంగులేటి మండిపడ్డారు. గిరిజన బంధు , దళిత బంధు , డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాల్లో లోపాలు ఉన్నాయని ఆరోపించారు. బడ్జెట్లో ప్రకటించినట్లుగా నిధుల కేటాయింపులు జరగడం లేదని పొంగులేటి చెప్పారు.
ప్రజలకు మాయ మాటలు చెప్పి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన ఆరోపించారు. జెండా ఏదైనా బీఆర్ఎస్ను గద్దె దించటమే తన అజెండా అని చెప్పారు. ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులను గద్దె దించటం శీనన్న కుటుంబ లక్ష్యమని చెప్పారు.
‘‘చెప్పిన మాటలు మళ్లీ చెప్పటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిట్ట. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలో ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తా’’ అని తెలిపారు.