freedom: స్వేచ్ఛ అంటే ఇదేనంటూ వీడియో షేర్ చేసిన ఐఎఫ్ఎస్
- ట్విట్టర్ లో వైరల్ గా మారిన వీడియో
- జంతువులను అడవిలో వదిలే దృశ్యాలను చూసి నెటిజన్లు ఫిదా
- ఇబ్బందులు ఎన్ని ఉన్నా స్వేచ్ఛ మాత్రం ఎప్పటికీ విలువైందేనని కామెంట్
భూమి మీద మనతో పాటు లక్షలాది జీవజాలం ఉంది.. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్నింటికీ స్వేచ్ఛగా బతికే అవకాశాన్ని ప్రకృతి ప్రసాదించింది. అయితే, కొంతమంది మనుషులు జంతువులను ప్రేమతోనో, స్టేటస్ కోసమనో బోనులో బంధించి పెంచుకుంటుంటారు. ప్రేమతో చేసినా సరే వాటికి మాత్రం అవి బందిఖానాలేనని ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాశ్వాన్ చెప్పారు. మూగజీవాలపై ప్రేమ ఉంటే వాటిని స్వేచ్ఛగా బతకనివ్వాలని అన్నారు. స్వేచ్ఛ అంటే ఇలా ఉంటుందంటూ తాజాగా ఆయన ఓ వీడియోను ట్వీట్ చేశారు. మానవ నివాసాల్లోకి వచ్చిన పక్షులు, జంతువులను కాపాడి తిరిగి అడవిలో వదిలేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.
ట్విట్టర్ లో ఈ వీడియో వైరల్ గా మారింది. ఏకంగా 13 లక్షల వ్యూస్, 24 వేల మంది లైక్ చేశారు. మరో 3,900 మంది ఐఎఫ్ఎస్ ప్రవీణ్ వీడియోను రీట్వీట్ చేశారు. వందలాదిమంది కామెంట్లు చేశారు. ఓ నెటిజన్ చేసిన కామెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘పెంపుడు జంతువుగానో, జూలోనో ఉంటే ఆహారం కోసం వెతికే పని ఉండదు, వేటగాళ్ల బారిన పడి ప్రాణం పోతుందేమోననే భయం ఉండదు. ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ స్వేచ్ఛగా బతకడమే విలువైంది’ అంటూ సదరు నెటిజన్ కామెంట్ చేశాడు.