Layoffs: మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. ఈ ఉద్యోగులకే రిస్క్ ఎక్కువ!
- మైక్రోసాఫ్ట్ హెచ్ఆర్ శాఖ మాజీ ఉద్యోగి క్రిస్ విలియమ్స్ ఆర్టికల్ వైరల్
- ఏయే విభాగాల్లోని సిబ్బందికి లేఆఫ్స్ రిస్క్ ఎక్కువో చెప్పిన క్రిస్
- ఇతరులతో పోలిస్తే హెచ్ఆర్, ఫైనాన్స్ సిబ్బంది కొంత సేఫ్ అని వివరణ
టెక్ రంగంలో కొనసాగుతున్న తొలగింపుల పర్వం ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఏ చెడు వార్త వినాల్సి వస్తుందో అనుకుంటూ ఉద్యోగులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ మానవవనరుల(హెచ్ఆర్) విభాగం మాజీ ఉపాధ్యక్షుడు క్రిస్ విలియమ్స్ రాసిన వ్యాసం వైరల్‌గా మారింది. లేఆఫ్స్ ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉందో చెబుతూ ఆయన తన ఆర్టికల్‌లో వివరించారు.
మైక్రోసాఫ్ట్‌లో మూడు రకాల ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రమాదం అధికంగా ఉందని క్రిస్ విలియమ్స్ పేర్కొన్నారు. కంపెనీ కష్టకాలంలో ఉన్నప్పుడు మొదటగా తొలగించేది కాంట్రాక్ట్ ఉద్యోగులనేనని ఆయన స్పష్టం చేశారు. కంపెనీల్లోని ఈవెంట్ ప్లానింగ్ విభాగంతో పాటూ సంబంధిత ఇతర డిపార్ట్‌మెంట్లలోని ఉద్యోగులూ జాబ్స్ కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. కష్టకాలంలో కంపెనీలు ఉద్యోగులకు టూర్లు, ఇతర సదుపాయాలు కల్పించని కారణంగా ఈవెంట్ ప్లానింగ్ సిబ్బంది అవసరం తగ్గుతుందని వివరించారు.
ఇక సంస్థకు లాభాలు తెచ్చిపెట్టే కీలకమైన విభాగాల్లోని ఉద్యోగులు సేఫ్ అని క్రిస్ చెప్పారు. ఇటువంటి శాఖల్లోని వారిని తొలగించే విషయంలో కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తాయన్నారు. మానవవనరులు, ఫైనాన్స్ విభాగాల్లోని ఉద్యోగులకు తొలగింపుల ప్రమాదం తక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆయా విభాగాల్లో సిబ్బంది సహజంగానే పరిమితంగా ఉంటారు కాబట్టి అక్కడ కోతలకు ఆస్కారం తక్కువని వివరించారు. ఎవరిని ఉద్యోగంలోకి తీసేయాలో నిర్ణయించేంది హెచ్ఆర్ శాఖ కాబట్టి..ఆ డిపార్టమెంట్ సిబ్బందికి రిస్క్ తక్కువని కూడా చమత్కరించారు. ఇక సంస్థల ఆర్థిక స్థితిగతులను సరిగా మదింపు వేయడంలో ఫైనాన్స్ విభాగం పాత్ర కీలకమని చెప్పిన క్రిస్.. ఈ శాఖలోని ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రమాదం తక్కువేనని చెప్పారు.