AP Government: ఏపీ ఉద్యోగ సంఘాల పోరుబాట.. ఈనెల 9 నుంచి ఆందోళనలు!

ap employees wili be protesting in ap from march 9th andhrapradesh

  • ఇచ్చిన హామీలను గుర్తుచేసేందుకే ఆందోళనలు చేస్తున్నామన్న బొప్పరాజు 
  • ఏప్రిల్ 3 వరకు దశలవారీగా ఉద్యమం చేస్తామని వెల్లడి
  • ఉద్యోగుల సమస్యలను నాలుగేళ్లుగా పట్టించుకోలేదని విమర్శ

ఏపీ ఉద్యోగ సంఘాలు పోరు బాటపట్టాయి. సమస్యలను పరిష్కరించాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యమానికి సిద్ధమవుతున్నామని చెబుతున్నాయి. ఈనెల 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్లు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ఇచ్చిన హామీలను గుర్తుచేసేందుకే ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపారు. 

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని బొప్పరాజు విమర్శించారు. ఈ నెల 9 నుంచి రాష్ట్రవ్యాప్త ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేస్తామని ప్రకటించారు. ఇలా ఏప్రిల్ 3 వరకు దశల వారీగా ఉద్యమం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే ఏప్రిల్ 5న జరిగే కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

జగన్ ప్రభుత్వం ఉద్యోగులను ఎందుకు నిర్లక్ష్యం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టబద్ధంగా తమకు రావాల్సినవి‌‌, తాము దాచుకున్న డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీ ఇచ్చి మరిచిపోయిన అంశాలను గుర్తుచేయడానికే తమ ఉద్యమం అని స్పష్టం చేశారు.

తమ జీపీఎఫ్ సంగతేంటని, అలా దాచుకోవడమే తమ నేరమా? అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. డీఏ అరియర్స్ లక్షలాది రూపాయలు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని వాపోయారు. సీపీఎస్‌ను వారం రోజుల్లో చేస్తామన్నారు.. ఏమైందని ప్రశ్నించారు. ఏ హామీ ఇవ్వని రాష్ట్రాలు కూడా సీపీఎస్ రద్దు చేశాయని గుర్తు చేశారు.

‘‘రాజకీయ నాయకులు ఎందుకు పెన్షన్ తీసుకుంటున్నారు? మీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసుకోగలరా? ప్రజాప్రతినిధుల జీతాలను వారే నిర్ణయించుకుంటారు.. వారికి పీఆర్సీలతో సంబంధం లేదా?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పారని, ఎందుకు చేయలేదని నిలదీశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి ఉద్యమంలో పాల్గొనాలని బొప్పరాజు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News