Sashi Tharoor: తల్లిదండ్రులను తెలివిగా ఎంపిక చేసుకోండి.. నాగాలాండ్ యువతి ప్రశ్నకు శశిథరూర్ ఫన్నీ ఆన్సర్
- అందం, తెలివి రెండూ కావాలంటే ఏంచేయాలని అడిగిన యువతి
- ఆ రెండింటికీ కారణం జన్యువులేనన్న శశి
- పుస్తకాలు చదవడం వల్ల తెలివితేటలు పెంచుకోవచ్చని సూచన
ఒక్కరిలోనే అందం, తెలివితేటలు ఎలా ఉంటాయని అడిగిన నాగాలాండ్ యువతికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఫన్నీగా జవాబిచ్చారు. తల్లిదండ్రులను ఎంచుకునేటపుడే తెలివిగా వ్యవహరించాలని అనడంతో సభ మొత్తం నవ్వులతో దద్దరిల్లింది. శశిథరూర్ ఇటీవల నాగాలాండ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి హాజరైన యువతలో కొంతమంది శశిథరూర్ కు పలు ప్రశ్నలు సంధించారు. ఆయన వాటికి జవాబిస్తూ పోతుండగా ఓ యువతి తన సందేహాన్ని లేవనెత్తింది.
మీరు ఇప్పటికీ చాలా అందంగా ఉంటారు, తెలివితేటలు కూడా చాలా ఎక్కువేనని అంటూ ఒక్కరిలోనే ఈ రెండూ ఉండడం ఎలా సాధ్యమని అడిగింది. అందం, తెలివితేటలు మెండుగా ఉండాలంటే ఏంచేయాలని ప్రశ్నించింది. సదరు యువతి ప్రశ్నకు సరదాగా నవ్వుతూ శశిథరూర్ జవాబిచ్చారు. అందం, మేధస్సు రెండూ కావాలంటే తల్లిదండ్రులను తెలివిగా ఎంచుకోవాలని సూచించారు. దీంతో ఆ యువతితో పాటు సభకు హాజరైన వారి ముఖాలపై నవ్వులు విరబూసాయి.
ఇక ఆ రెండింటికీ కారణం జన్యువులేనని చెబుతూ.. తెలివితేటలను మాత్రం సంపాదించుకోవచ్చని శశిథరూర్ వ్యాఖ్యానించారు. పుస్తకాలు చదవడం అలవాటుగా మార్చుకుంటే తెలివితేటలు పెంచుకోవచ్చని సూచించారు. చిన్నతనం నుంచే తాను పుస్తకాలు చదివేవాడినని, అలా చదివిన వాటిలో నుంచి చాలా వరకు విషయాలను గ్రహించానని కాంగ్రెస్ ఎంపీ వివరించారు. ఇటీవల జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన స్నేహితుడు ఒకరు ఈ వీడియో పంపించాడంటూ శశిథరూర్ తన ట్విట్టర్ ఎకౌంట్ లో దీనిని షేర్ చేశారు.